ఉచిత సిలెండర్లకు ఆదివాసీల అవస్థలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:35 PM
రాష్ట్ర ప్రభుత్వం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో ఆదివాసీలు ఈకేవైసీ చేయించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.

ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు
గతంలో ధర పెరగడంతో గ్యాస్ విడిపించని గిరిజనులు
కనెక్షన్లు యాక్టివ్ చేసుకునేందుకు ఆరాటం
చింతపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో ఆదివాసీలు ఈకేవైసీ చేయించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం స్థానిక జీసీసీ హెచ్‌పీ గ్యాస్ కార్యాలయానికి భారీ సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చారు. ఎన్డీయే కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. దీపావళి నుంచి ఈ పథకం అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆదివాసీలు గ్యాస్ కనెక్షన్లను యాక్టివ్ చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆదివాసీలు గ్యాస్ వినియోగానికి దూరమై కట్టెల పొయ్యిలను ఆశ్రయించారు. గ్యాస్ వినియోగించుకపోవడం వల్ల కనెక్షన్లు డీయాక్టివ్ అయిపోయాయి. దీంతో ఎక్కడ ఉచిత గ్యాస్ పథకానికి దూరమైపోతామోననే భయంతో ఈకేవైసీ చేయించుకునేందుకు వారు అప్‌డేట్ చేయించుకుంటున్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ఆదివాసీలు గ్యాస్ కార్యాలయానికి రావడంతో క్యూ పెరిగిపోయింది. దీంతో జీసీసీ గ్యాస్ అధికారులు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఈకేవైసీ చేయిస్తున్నారు.