Share News

భూ కబ్జాదారుల్లో వణుకు

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:17 AM

ప్రభుత్వ భూములు కాజేసిన ఆక్రమణదారుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు గత ఐదేళ్లలో సాగించిన భూదందాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. జనవరి 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయి. ప్రభుత్వ, దేవదాయ భూములతోపాటు ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూములను అక్రమంగా కైవసం చేసుకున్న వైసీపీ నేతలపై పెద్ద ఎత్తులు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో భూ కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది.

భూ కబ్జాదారుల్లో వణుకు
కె.కోటపాడు మండలం ఎ.భీమవరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మహిళ నుంచి ఆర్జీ స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (ఫైల్‌ ఫొటో)

రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు

22ఏ నిషేధిత జాబితాలోని భూములు అన్యాక్రాంతం

అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పేరున వెబ్‌ల్యాండ్‌లో నమోదు

రెవెన్యూ సదస్సుల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు

వైసీపీ నేతలకు సహకరించిన అధికారుల్లో గుబులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూములు కాజేసిన ఆక్రమణదారుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు గత ఐదేళ్లలో సాగించిన భూదందాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. జనవరి 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయి. ప్రభుత్వ, దేవదాయ భూములతోపాటు ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూములను అక్రమంగా కైవసం చేసుకున్న వైసీపీ నేతలపై పెద్ద ఎత్తులు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో భూ కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది.

గత వైసీపీ ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వే పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఇష్టారాజ్యంగా సర్వే చేసింది. కొంతమంది వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేసి రీసర్వే ముసుగులో 22ఏ జాబితాలో వున్న ప్రభుత్వ భూములను తమ పేరున, బంధువుల పేరున రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. కొన్నిచోట్ల జిరాయితీ భూములను సైతం తమ వశం చేసుకున్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు సహకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. అనకాపల్లి మండలంలో ఏడు గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సుమారు 900 ఎకరాల భూములను అప్పటి వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుంది. అయితే వైసీపీ నాయకుల బినామీ పేర్లను జాబితాలో చేర్చి వీఎంఆర్‌డీఏ నుంచి పరిహారంగా నివాస స్థలాలను పొందినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కశింకోట మండలం విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను జిల్లాకు చెందిన ఒక మంత్రి (ఇప్పుడు మాజీ) అనుచరులు కబ్జా చేసి లేఅవుట్‌ వేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 41, 49, 50, 51ల్లో 22ఏ జాబితాలో వున్న 23 ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి నిషేధిత జాబితా నుంచి తొలగించుకున్నారు. దీనిపై గ్రామస్థులు రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేశారు.

భూ ఆక్రమణలపై వెయ్యికి పైగా ఫిర్యాదులు

జిల్లాలో 710 రెవెన్యూ గ్రామాలు వుండగా ఇప్పటి వరకు 323 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రజల నుంచి 17,055 ఫిర్యాదులు/ అర్జీలు అందాయి. వీటిలో వెయ్యికిపైగా ఫిర్యాదులు వైసీపీ నాయకుల భూదందాలకు సంబంధించినవి వున్నట్టు సమాచారం. వీటిలో అత్యధిక శాతం 22ఏ నిషేధిత జాబితాలో వున్న ప్రభుత్వ భూములని తెలిసింది. మిగిలినవి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ, వెబ్‌ ల్యాండ్‌లో పేర్లు మార్పు, విస్తీర్ణం తప్పుగా నమోదు అయినవి వున్నాయి. రీసర్వేలో తమ భూములను తక్కువగా చూపి రికార్డుల్లో నమోదు చేశారని, వాటిని సరిదిద్దాలని ఎక్కువమంది అర్జీలు పెట్టుకుంటున్నారు. కాగా వైసీపీ నాయకుల భూదందాలపై ఫిర్యాదులు అందుతుండడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో వీరికి సహకరించిన రెవెన్యూ అధికారుల్లో వణుకు మొదలైంది. రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుందా? అంతటితో ఆగకుండా క్రిమినల్‌ చర్యలకు కూడా దిగుతుందా? అని ఆక్రమణదారులు గుబులు చెందుతున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:17 AM