ఆర్ట్టీసీ బస్సులో గంజాయి రవాణా
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:35 AM
అగనంపూడి టోల్‌గేటు వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలను దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకుని 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
14 కిలోలు స్వాధీనం, భార్యాభర్తలు అరెస్టు
కూర్మన్నపాలెం, ఏప్రిల్ 10: అగనంపూడి టోల్‌గేటు వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలను దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకుని 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులో నివాసముంటున్న భార్యాభర్తలు నాగరాజు, భారతి దంపతులు కుక్కలను విక్రయిస్తూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి చంద్రప్ప అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న చంద్రప్ప మీరు ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నానికి వెళితే ఓ వ్యక్తి గంజాయి ఇస్తాడని, దానిని తెచ్చి తనకు అప్పగిస్తే పెద్ద మొత్తంలో నగదు ఇస్తానని ఆశ చూపాడు. రవాణా చార్జీలను కూడా తానే భరిస్తాననీ చెప్పడంతో ఆ దంపతులిద్దరూ ఈ నెల ఎనిమిదిన బెంగళూరు నుంచి రైలులో తుని చేరుకుని, అక్కడ నుంచి బస్సులో నర్సీపట్నం వెళ్లి బస్టాండ్‌లోనే బస చేశారు. బుధవారం ఉదయం ఓ వ్యక్తి వచ్చి గంజాయి బ్యాగులను వారికి అందజేశాడు. ఈ క్రమంలో వారికి చంద్రప్ప ఫోన్ చేసి నర్సీపట్నం నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌కు వచ్చి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు రావాలని సూచించాడు. దీంతో వారు రెండు కిలోల చొప్పున ఏడు ప్యాకెట్లలో ఉన్న 14 కేజీల గంజాయితో నర్సీపట్నం నుంచి విశాఖకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. ఎన్నికల నేపథ్యంలో అగనంపూడి టోల్‌గేటు వద్ద అధికారులు, దువ్వాడ పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడింది. ఈ మేరకు నాగరాజు, భారతిలను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దంపతులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.