Share News

విషాదం

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:54 AM

పెందుర్తిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వ్యాపార పనులపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పెందుర్తి జంక్షన్‌లో లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యాభర్తలను వ్యాన్‌ ఢీకొనడంతో భర్త మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విషాదం
సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడిన నాగరాజేశ్వరి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

భర్త మృతి...భార్యకు తీవ్ర గాయాలు

గర్భవతిగా ఉన్న ఆమెను

పెద్దమ్మ ఆశీర్వాదం కోసం తీసుకుని వెళ్లి

తిరిగివస్తుండగా ప్రమాదం

ఆగి ఉన్న బైక్‌ను ఢీకొనడంతో మరొకరు

పెందుర్తి, ఏప్రిల్‌ 16:

పెందుర్తిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వ్యాపార పనులపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పెందుర్తి జంక్షన్‌లో లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యాభర్తలను వ్యాన్‌ ఢీకొనడంతో భర్త మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెందుర్తి సమీప దొగ్గవానిపాలేనికి చెందిన బత్తిన సంతోష్‌ (26), నాగరాజేశ్వరి (20) దంపతులు. వీరికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. గర్భవతిగా వున్న నాగరాజేశ్వరికి ఆమె పెద్దమ్మ ఆశీర్వాదం ఇప్పించేందుకు సంతోష్‌ మంగళవారం ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం తీసుకువెళ్లాడు. బంధువులతో ఆనందంగా గడిపి, సాయంత్రం తిరుగుపయనమయ్యారు. వారి ద్విచక్ర వాహనాన్ని జాతీయ రహదారిపై సరిపల్లి బైపాస్‌ బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ బైక్‌ పైనుంచి ఎగిరి కిందకు పడిపోయారు. ప్రమాదంలో సంతోష్‌ తలకు బలమైన గాయమవడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కుడివైపు డివైడర్‌ పక్కన పడిన నాగరాజేశ్వరి రెండు కాళ్లు విరిగిపోయాయి. కళ్లెదుటే భర్త మృతిచెందడంతో ఆమె రోదిస్తూ కుప్పకూలింది. సంతోష్‌ పెందుర్తిలోని ఓ వైన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. తీవ్రంగాగాయపడిన నాగరాజేశ్వరిని, సంతోష్‌ మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.

సిగ్నల్‌ పాయింట్‌ వద్ద లారీ ఢీకొని...

పెందుర్తి జంక్షన్‌ సిగ్నల్‌ పాయింట్‌ వద్ద లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. పాత పెందుర్తికి చెందిన గొర్లె సన్నిబాబు (55) ద్విచక్ర వాహనంపై పెందుర్తి వచ్చాడు. సిగ్నల్‌ పాయింట్‌ వద్ద ఆగి ఉన్న అతడిని అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అతడు బైక్‌తో సహా లారీ కిందకు వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన సన్నిబాబును 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాతపడ్డాడు. సన్నిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సీఐ ఎల్‌.రామకృష్ణ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 07:14 AM