Share News

ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారుల దందా!

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:32 AM

ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారుల దందాసాగుతోంది.

ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారుల దందా!

యథేచ్ఛగా ఎంఆర్‌పీ ఉల్లంఘన

ప్రతి వస్తువుపై రూ.ఐదు నుంచి పది అదనంగా వసూలు

వ్యాపారులతో నిత్యం ప్రయాణికుల ఘర్షణ

అయినా పట్టించుకోని బస్‌స్టేషన్‌ అధికారులు

లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలని వివరణ

నెలవారీ మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారుల దందాసాగుతోంది. వస్తువులన్నింటినీ ముద్రిత ధరలు (ఎంఆర్‌పీ)కి విక్రయించాల్సి ఉన్నా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో వస్తువుపై కనీసం రూ.ఐదునుంచి రూ.పది వరకూ వసూలుచేస్తున్నారు. దీనిపై కొంతమంది ప్రయాణికులు వ్యాపారులను నిలదీస్తుండడంతో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న అధికారులు ప్రత్యక్షంగా ఈ దృశ్యాలను చూస్తున్నప్పటికీ తమకు సంబంధంలేదన్నట్టు వెళ్లిపోతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అందడం వలనే వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో విజయవాడ తర్వాత అతిపెద్దదిగా ద్వారకాబస్‌స్టేషన్‌కు గుర్తింపు వుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు 804 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 40 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి. దీంతో బస్‌స్టేషన్‌ నిత్యం రద్దీని సంతరించుకుంటుంది. ప్రయాణికులతోపాటు వారిని సాగనంపేందుకు, రిసీవ్‌ చేసుకునేందుకు మరో పది వేల మంది వస్తుంటారు. దీంతో బస్‌స్టేషన్‌లో తాగునీరు, కూల్‌డ్రింకులు, బిస్కెట్లు వంటి వాటికి డిమాండ్‌ ఎక్కువ. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆహారపదార్థాలు, కూల్‌డ్రింకులు, బేకరీ ఉత్పత్తులు విక్రయించేందుకు 44 దుకాణాలున్నాయి. వీటిని ఆర్టీసీ అధికారులు టెండరు ద్వారా వ్యాపారులకు కేటాయిస్తారు. దుకాణంలో ఏయే వస్తువులు విక్రయించాలి, నాణ్యత, ఎంఆర్‌పీ అమలుపై నిత్యం పర్యవేక్షణ ఉండాలి. ఎవరైనా నాణ్యతలేని వస్తువులను విక్రయించినా, ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేసినా జరిమానా విధించడంతోపాటు దుకాణాల కేటాయింపును రద్దుచేసేలా ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటారు.

యథేచ్ఛగా ఉల్లంఘన

ద్వారకాబస్‌స్టేషన్‌లో వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఒక వస్తువు విక్రయించేందుకు దుకాణాన్ని తీసుకుని, అదనపు వస్తువులను విక్రయించడం, ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. వాటర్‌బాటిల్‌ ఎంఆర్‌పీ రూ.20 ఉంటే కొన్ని దుకాణాల్లో రూ.25, మరిన్ని దుకాణాల్లో రూ.30కు విక్రయిస్తున్నారు. కూల్‌డ్రింకు అరలీటర్‌ రూ.40 కాగా, రూ.50కి విక్రయిస్తున్నారు. చిన్నపిల్లలు ఇష్టంగా తినే లేస్‌ చిన్న ప్యాకెట్‌ ఎంఆర్‌పీ రూ.15కాగా రూ.20కి విక్రయిస్తున్నారు. బ్రిటానియా బిస్కెట్‌ ప్యాకెట్‌ చిన్నది రూ.20 కాగా రూ.25కి విక్రయిస్తున్నారు. అధికంగా వసూలు చేయడంపై ప్రయాణికులు నిలదీస్తే ‘నచ్చితే కొనండి. లేకపోతే వెళ్లిపోండంటూ’ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా బస్‌స్టేషన్‌లోని అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా అధికారులకు వివరిస్తే, లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని మాత్రమే సమాధానమిస్తున్నారు. దుకాణాల నిర్వాహకుల నుంచి అధికారులకు ప్రతినెలా మామూళ్లు అందుతుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంఆర్‌పీ ఉల్లంఘిస్తే చర్యలు

ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో ఎంఆర్‌పీకి మాత్రమే విక్రయించాలి. ఎవరైనా ఉల్లంఘిస్తే లిఖితపూర్వకంగా స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయం, విచారణ కౌంటర్‌ వద్ద ఏర్పాటుచేసిన ఫిర్యాదుల పెట్టెలో వేస్తే, పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఉల్లంఘన రుజువైతే మొదటిసారి రూ.500 నుంచి రూ.వెయ్యి జరిమానా, తర్వాత కూడా ఉల్లంఘన జరిగితే దుకాణం రద్దుకు నోటీసు ఇస్తాం. అప్పటికీ మారకుంటే కేటాయింపును రద్దుచేస్తాం.

- అంధవరపు అప్పలరాజు, రీజనల్‌ మేనేజర్‌

ఐటెం ఎంఆర్‌పీ విక్రయిస్తున్న ధర

కూల్‌డ్రింక్‌ అరలీటర్‌ రూ.40 రూ.50

లేస్‌ ప్యాకెట్‌ రూ.15 రూ.20

వాటర్‌బాటిల్‌ (లీటర్‌) రూ.20 రూ.25

పాప్‌కార్న్‌ రూ.15 రూ.20

బ్రిటానియా బిస్కెట్‌ ప్యాకెట్‌ రూ.20 రూ.30

Updated Date - Mar 18 , 2024 | 01:32 AM