స్తంభించిన నిత్యావసరాల వ్యాపారం
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:22 AM
హమాలీ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ముఠా కార్మికులు సమ్మెకు దిగడం, వాళ్లు (కార్మికులు) అడిగింత పెంచలేమని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో గురువారం అనకాపల్లి పట్టణంలో నిత్యావసర సరకుల వ్యాపారం స్తంభించింది. ఈ సందర్భంగా కిరాణా హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు దుకాణాలను మూసివేసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. డీఆర్‌ఓ, ఆర్డీవోలను కలిసి వినతిపత్రాలు అందించారు.

కూలి రేట్లు 50 శాతం పెంచాలని ముఠా కార్మికులు సమ్మె నోటీసు
13 శాతానికి మించి పెంచలేమన్న వ్యాపారులు
దుకాణాలు మూసివేసి నిరసన
అధికారులకు వినతిపత్రాలు
అనకాపల్లి టౌన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హమాలీ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ముఠా కార్మికులు సమ్మెకు దిగడం, వాళ్లు (కార్మికులు) అడిగింత పెంచలేమని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో గురువారం అనకాపల్లి పట్టణంలో నిత్యావసర సరకుల వ్యాపారం స్తంభించింది. ఈ సందర్భంగా కిరాణా హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు దుకాణాలను మూసివేసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. డీఆర్‌ఓ, ఆర్డీవోలను కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వర్తక సంఘాల ప్రతినిధులు శ్రీధరాల సోమరాజు, బొడ్డేడ శంకరరావు, గుండా సాయి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న కూలి రేట్లను 50 శాతం పెంచాలని ముఠా కార్మికులు ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఇస్తున్న రేట్లపై 13 శాతం పెంచుతామని చెప్పామన్నారు. ఇందుకు కార్మికులు అంగీకరించకుండా సమ్మెకు దిగారని అన్నారు. దీంతో వివిధ వర్తక సంఘాల పరిధిలో వున్న మొత్తం 165 దుకాణాలను మూసివేయాలని నిర్ణయించున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా వర్తకసంఘాల ప్రతినిధులు బి.సత్యనారాయణ, కె.లక్ష్మోజీ, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.