సొంతింటి కల సాకారం దిశగా..
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:02 AM
జిల్లాలో గృహ లబ్ధిదారుల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడత కింద ఇప్పటికే వివిధ దశల్లో నిలిచిపోయిన 6,643 గృహ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇళ్ల నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి
తొలి విడత 6,643 నిర్మాణాలు
ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గృహ లబ్ధిదారుల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడత కింద ఇప్పటికే వివిధ దశల్లో నిలిచిపోయిన 6,643 గృహ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రచారమే తప్ప పనులు జరగని జగనన్న కాలనీల్లో ఇప్పుడు పనులు ఊపందుకున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల నిర్మాణాల పేరుతో ప్రచార ఆర్భాటమే తప్ప ఎక్కడా ఇళ్ల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగలేదు. బిల్లుల మంజూరులో జాప్యం, భవన నిర్మాణ సామగ్రి అందుబాటులో లేక చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా, కొత్తగా లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేసేందుకు ‘మన ఇల్లు- మన గౌరవం’ పేరుతో నిర్మాణాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు వెబెక్స్ ద్వారా సమీక్షలు జరుపుతున్నారు. గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని, ప్రతి వంద రోజులకు నిర్దిష్ట సంఖ్యలో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి దశల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో 2015 నుంచి ఇటీవల వరకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రూ.65,800 ఇళ్లు పేదలకు మంజూరయ్యాయి. వీటిలో 17,633 గృహ నిర్మాణ పనులు వివిధ కారణాలతో ప్రారంభంకాలేదు. 48,167 గృహ నిర్మాణ పనులు ప్రారంభం కాగా 28,746 పూర్తయ్యాయి. ప్రస్తుతం వివిధ దశల్లో 19,421 గృహ నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో తొలి దశ కింద 6,643 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయకృష్ణన్ నేతృత్వంలో పీడీ శ్రీనివాస్ పర్యవేక్షణలో గృహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులు చేపడుతున్న 6,643 ఇళ్లలో ఇప్పటికే 5,085 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,558 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి జిల్లాలో తొలిదశ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని పీడీ శ్రీనివాసరావు తెలిపారు. పనులు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపునకు నిధుల కొరత లేదన్నారు. కాంట్రాక్టర్ చేపట్టిన గృహ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.