Share News

ఖాయిలా దిశగా ‘తాండవ’..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:24 AM

కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారం మూడేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. క్రషింగ్‌ పూర్తిగా నిలిపివేయడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. పైగా వారికి ఫ్యాక్టరీ యాజమాన్యం జీతాలు చెల్లంచలేని స్థితిలో ఉండడంతో చేసేందుకు పని, చేతిలో చిల్లిగవ్వలేక కుటుంబ పోషణకు కార్మికులంతా కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఖాయిలా దిశగా   ‘తాండవ’..!
నిర్మానుష్యంగా ఫ్యాక్టరీ ఆవరణ

మూడేళ్లుగా క్రషింగ్‌కు దూరమైన చక్కెర కర్మాగారం

ఉపాధి కోల్పోయిన వందలాది కార్మికులు

జీతాల బకాయిలు కోసం ఇప్పటికీ ఎదురుచూపులు

దుమ్ము, తుప్పు పట్టిన యంత్రాలు

నిరుపయోగంగా రూ.6.31 కోట్ల ఆటోమేషన్‌ ఎక్విప్‌మెంట్‌

వైసీపీ ప్రభుత్వ చర్యలతో మూత దిశగా పయనం

పాయకరావుపేట, మే 31:

కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారం మూడేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. క్రషింగ్‌ పూర్తిగా నిలిపివేయడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. పైగా వారికి ఫ్యాక్టరీ యాజమాన్యం జీతాలు చెల్లంచలేని స్థితిలో ఉండడంతో చేసేందుకు పని, చేతిలో చిల్లిగవ్వలేక కుటుంబ పోషణకు కార్మికులంతా కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

వేలమంది చెరకు రైతులకు ఐదు దశాబ్దాలుగా ప్రధాన జీవనాధారంగా, వందలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ సేవలందించిన తాండవ సహకార చక్కెర కర్మాగారం రెండు దశాబ్దాలుగా సుమారు రూ.40 కోట్ల నష్టాల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏటా క్రషింగ్‌ సీజన్‌లో ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పంచదారను ఆప్‌కాబ్‌లో తనఖాపెట్టి చెరకు సరఫరాచేసిన రైతులకు పేమెంట్లు, కార్మికులకు జీతాలు, ఫ్యాక్టరీ నిర్వహణ చేపడుతున్నారు. అయితే గత 35 ఏళ్లుగా ఫ్యాక్టరీలో యంత్రాలు ఆధునికీకరణకు నోచుకోక, బస్తా పంచదార ఉత్పత్తికి అయ్యే ఖర్చు కంటే మార్కెట్‌లో ధర తక్కువగా ఉండడంతో రైతుల పేమెంట్లు, కార్మికుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితికి చేరింది. ఏడేళ్ల క్రితం ఫ్యాక్టరీలోని పంచదార విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించడంతో ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. దీంతో 2018-19, 2019-20 క్రషింగ్‌ సీజన్‌లలో చెరకు సరఫరా చేసిన రైతులకు ఎన్‌సీడీసీ, రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సాయంతో పేమెంట్లు చేయాల్సి వచ్చింది. అయితే 2020-21 క్రషింగ్‌ సీజన్‌లో ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.10.65 కోట్లు, కార్మికులకు జీతాల బకాయిలు సుమారు రూ.10 కోట్లు చెల్లించలేని స్థితికి చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించలేదు. దీంతో రైతులు తమకు రావాల్సిన డబ్బుల కోసం ఏడాదిన్నరగా ఆందోళనలు, ఉద్యమాలు చేసిన తరువాత 2022లో ఫ్యాక్టరీ రైతులకు ఇవ్వాల్సిన నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. జీతాల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. సహకార చక్కెర కర్మాగారాలను అభివృద్ధి చేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అధ్యయనానికి క్యాబినెట్‌ సబ్‌ కమిటీవేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఫ్యాక్టరీ నిర్వహణకు కూడా నిధుల్లేక 2021-22 నుంచి క్రషింగ్‌ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఫుల్‌ టైమ్‌, సీజనల్‌ ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన జీతాల బకాయిలు కూడా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకు భవన నిర్మాణ కార్మికులుగా, షాపులు, హోటళ్లలో పనివారిగా మారారు.

నిరుపయోగంగా ఆటోమేషన్‌ ఎక్విప్‌మెంట్‌

ఇదిలా ఉండగా తాండవ షుగర్స్‌లో ఆధునిక యంత్రాలు లేక పంచదార ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఉత్పత్తిలో వృథాను తగ్గించేందుకు 2015లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఆటోమేషన్‌ ఎక్విప్‌మెంట్‌ను రూ.6.31 కోట్లతో ఏర్పాటుచేసింది. ఆ తరువాత ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి పడిపోయి నిర్వహణ భారం కావడం, ఏటా చెరకు క్రషింగ్‌ తగ్గుతూ వచ్చింది. ఫలితంగా ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన ఆటోమేషన్‌ ఎక్విప్‌మెంట్‌ నిరుపయోగంగా మారింది.

ఆధునీకరణతోనే అభివృద్ధి

తాండవ చక్కెర కర్మాగారం ఆర్థికంగా గట్టెక్కాలంటే ఆధునికీకరణ ఒక్కటే మార్గమని యాజమాన్యం గుర్తించింది. కేవలం పంచదార ఉత్పత్తి మాత్రమే జరగడంతో నష్టాలు ఎదురవుతున్నాయని, ఉప ఉత్పత్తులైన కో-జనరేషన్‌ ప్లాంట్‌, బాట్లింగ్‌, డిస్టలరీ ఏర్పాటుకు సాయం కోరుతూ సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించింది. అయినా వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. గత మూడు సీజన్లలో ఫ్యాక్టరీ పనిచేయక యంత్రాలు తుప్పపట్టి పాడైన ప్రస్తుత తరుణంలో ఫ్యాక్టరీని తిరిగి రన్నింగ్‌లో పెట్టాలంటే కొత్త యంత్రాలు సమకూర్చాలని కార్మికులు చెబుతున్నారు. లేదంటే ఖాయిలా దశకు చేరుకుని శాశ్వతంగా మూతపడే ప్రమాదముందంటున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 01:24 AM