ఊరి కోసం కూటమి వైపు
ABN , Publish Date - May 12 , 2024 | 01:24 AM
తమ గ్రామాలు, వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు కూటమి(బీజేపీ, జనసే, టీడీపీ) అభ్యర్థులకు ఓటు వేస్తామని యర్రవరం గిరిజనులు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకుని యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలిపారు.

- మా గ్రామాలు, వ్యవసాయ భూములు కాపాడుకునేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తాం
- హైడ్రో పవర్ ప్రాజెక్టును అడ్డుకుంటాం
- యర్రవరం గిరిజనుల స్పష్టీకరణ
- కూటమికి మద్దతు ఇవ్వాలని తీర్మానం
చింతపల్లి, మే 11: తమ గ్రామాలు, వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు కూటమి(బీజేపీ, జనసే, టీడీపీ) అభ్యర్థులకు ఓటు వేస్తామని యర్రవరం గిరిజనులు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకుని యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలిపారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆ గ్రామానికి చెందిన గిరిజనులు మాట్లాడారు. యర్రవరం కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం 2021 డిసెంబరులో అనుమతులు మంజూరు చేసిందని, 2023లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పారు. దీంతో యర్రవరం పరిసర 23 గిరిజన గ్రామాల గిరిజనులు ఆందోళన బాట పట్టామన్నారు. చింతపల్లి, పాడేరు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్, కలెక్టర్‌కి హైడ్రో వపర్ ప్రాజెక్టు రద్దు చేయాలని వినతి పత్రాలు అందజేశామని, చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో గిరిజనులు స్వచ్ఛందంగా బంద్ పాటించామని చెప్పారు. అయినప్పటికి వైసీపీ ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలపై వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహస్యంగా కొయ్యూరు, చింతపల్లి సరిహద్దు గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగులతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రతినిధులు సర్వేలు చేపట్టారని, దీన్ని అడ్డుకున్నామన్నారు. స్థానిక గిరిజనులు ఆందోళన చేస్తున్నప్పటికి గిరిజన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు మౌనం వహించారని మండిపడ్డారు.
కూటమికి మద్దతు
యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును అడ్డుకోవాలనే లక్ష్యంగా యర్రవరం పరిసర గిరిజన గ్రామాల ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొయ్యూరు, జీకేవీధి మండలాల పరిధిలో సుమారు 34 గిరిజన గ్రామాలు, సుమారు 4,500 హెక్టార్ల వ్యవసాయ భూములు, ఉద్యాన పంటల తోటలను గిరిజనులు నష్టపోవాల్సి వస్తుంది. యర్రవరం సమీపంలోని గానుగుల గ్రామం వద్ద ఎగువ, దిగువ డ్యామ్‌లు నిర్మించనున్నారు. 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. దీంతో స్థానిక గిరిజనులు గ్రామాలను ఖాళీచేసి పొరుగు గ్రామాలను వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గిరిజనులను నష్టపరిచే హైడ్రో పవర్ ప్రాజెక్టు అడ్డుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలుపించుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. గిరిజనులకు నష్టం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టును నిలిపివేస్తామని ఇప్పటికే టీడీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి హామీ ఇచ్చారు. దీంతో యర్రవరం పరిసర గ్రామాల ప్రజలు కూటమి ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.