పరిష్కారం దిశగా పంచ గ్రామాల భూ సమస్య
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:37 AM
సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామాల్లో నిర్మాణాలు క్రమబద్ధీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, పి.గణబాబు, పంచకర్ల రమేష్‌బాబులు విజయనగరంలో దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్‌గజపతిరాజును కలిశారు.

సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్‌గజపతిరాజును
కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు
ఆ 420 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా
620 ఎకరాలు ఇచ్చేందుకు ప్రతిపాదన
తమ హయాంలో సమస్య పరిష్కారం కావడం
సంతోషదాయకమన్న అశోక్‌గజపతిరాజు
విజయనగరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామాల్లో నిర్మాణాలు క్రమబద్ధీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, పి.గణబాబు, పంచకర్ల రమేష్‌బాబులు విజయనగరంలో దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్‌గజపతిరాజును కలిశారు. పంచగ్రామాల భూ సమస్యపై ఆయనతో చర్చించారు. సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. చర్చల అనంతరం విలేకరులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్న పంచ గ్రామాల భూముల విషయంపై అశోక్‌గజపతిరాజుతో చర్చించామన్నారు. ఈ గ్రామాల పరిధిలో 420 ఎకరాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. ఆ 420 ఎకరాలకు బదులు సింహాచల దేవస్థానానికి ప్రభుత్వం 620 ఎకరాలు ఇస్తూ...దానికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చును దేవస్థానం ఖాతాకు జమ చేయనున్నట్టు తెలిపారు. తద్వారా ఆయా గ్రామాల పరిధిలో ప్రజలకు ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్టు అవుతుందన్నారు. దేవస్థానం చైర్మన్ అశోక్‌గజపతిరాజు సానుకూలంగా స్పందించడంతో ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని పల్లా శ్రీనివాస్ చెప్పారు. సింహా చలం దేవస్థానం బోర్డు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఈ సమస్య తమ హయాంలో పరిష్కారం అయితే సంతోషదాయకమన్నారు. అయితే భూములు బదలాయింపు, గృహాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా జరగాలన్నారు. అలాగే స్వామి వారి చందనోత్సవానికి అవసరమయ్యే గంధపు వనాలను పెంచాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో గోవులకు తిండి కూడా పెట్టని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు.