Share News

పర్యాటక ప్రాంతాలు వెలవెల

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:48 PM

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకుల సందడి తగ్గింది. వాతావరణంలోని మార్పులతో ఏజెన్సీలో పొగమంచు ప్రభావం తగ్గిపోవడంతో పాటు ప్రస్తుతం విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.

పర్యాటక ప్రాంతాలు వెలవెల
నిర్మానుష్యంగా కనిపిస్తున్న చెరువులవేనం వ్యూపాయింట్‌

మన్యంలో కానరాని సందర్శకుల సందడి

పొగమంచు తగ్గడం, విద్యార్థులకు వార్షిక పరీక్షలే కారణం

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకుల సందడి తగ్గింది. వాతావరణంలోని మార్పులతో ఏజెన్సీలో పొగమంచు ప్రభావం తగ్గిపోవడంతో పాటు ప్రస్తుతం విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల సందడి తగ్గింది. అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, కొత్తవలస వ్యవసాయ క్షేత్రం, పెదలబుడు గిరిజన గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయిగెడ్డ, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మోదకొండమ్మ ఆలయం, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కానరాలేదు.

బోసిపోయిన చెరువులవేనం

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి, పరిసర పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులు లేక బోసిపోయాయి. వేసవిలోనూ చెరువులవేనం మంచు అందాలు అలరిస్తున్నప్పటికి పర్యాటకులు సందర్శించడం లేదు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండడంతో సందర్శకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో తాజంగి జలాశయం, చెరువులవేనం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

వెలవెలబోయిన చాపరాయి

డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం ఆదివారం పర్యాటకులు లేక బోసిపోయింది. ఎండలు ఠారెత్తిస్తుండడం, విద్యార్థులకు వార్షిక పరీక్షల నేపథ్యంలో ఇక్కడ సందడి కనిపించలేదు. వ్యాపారాలు లేక చిరు వర్తకులు డీలా పడ్డారు.

Updated Date - Mar 24 , 2024 | 11:48 PM