Share News

పుంజుకున్న పర్యాటకం

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:22 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. కరోనా కారణంగా రెండేళ్లు పడకేసిన ఈ రంగం 2023లో ఊహించని విధంగా పుంజుకుంది. గత జనవరి నుంచి డిసెంబరు వరకు పన్నెండు నెలల్లో 1,71,78,184 మంది పర్యాటకులు ఉమ్మడి జిల్లాను సందర్శించారు. అంటే రోజుకు సగటున 47 వేల మంది చొప్పున నెలకు సుమారుగా 15 లక్షల మంది విచ్చేశారు. విదేశీ ప్రయాణికుల సంఖ్య 40,749గా నమోదైంది. కరోనాకు ముందు సింగపూర్‌, దుబాయ్‌, మలేషియా, శ్రీలంక దేశాలకు విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండేవి. కరోనా తరువాత సింగపూర్‌ సర్వీసును మాత్రమే పునరుద్ధరించారు. మిగిలిన మూడు సర్వీసులు నిలిచిపోయాయి. అయినా సరే విదేశీ పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది.

పుంజుకున్న పర్యాటకం

పెరిగిన సందర్శకులు

ఉమ్మడి విశాఖ జిల్లాకు 2023లో 1.71 కోట్ల మంది రాక

సగటున రోజుకు 47 వేల మంది రాక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. కరోనా కారణంగా రెండేళ్లు పడకేసిన ఈ రంగం 2023లో ఊహించని విధంగా పుంజుకుంది. గత జనవరి నుంచి డిసెంబరు వరకు పన్నెండు నెలల్లో 1,71,78,184 మంది పర్యాటకులు ఉమ్మడి జిల్లాను సందర్శించారు. అంటే రోజుకు సగటున 47 వేల మంది చొప్పున నెలకు సుమారుగా 15 లక్షల మంది విచ్చేశారు. విదేశీ ప్రయాణికుల సంఖ్య 40,749గా నమోదైంది. కరోనాకు ముందు సింగపూర్‌, దుబాయ్‌, మలేషియా, శ్రీలంక దేశాలకు విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండేవి. కరోనా తరువాత సింగపూర్‌ సర్వీసును మాత్రమే పునరుద్ధరించారు. మిగిలిన మూడు సర్వీసులు నిలిచిపోయాయి. అయినా సరే విదేశీ పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది.

ఆకర్షిస్తున్న కొత్త ప్రాంతాలు

కరోనా తరువాత చాలామంది వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పర్యటనలకు వెళ్లడం ప్రారంభించారు. ఇదే సమయాన అల్లూరి సీతారామరాజు జిల్లాలో శీతాకాలం ఎక్కడికక్కడ అందమైన మేఘాలు ఆవిష్కృతం కావడం, అవి సోషల్‌ మీడియా ద్వారా జనబాహూళ్యం దృష్టికి వెళ్లడంతో ‘ఛలో ఏజెన్సీ’ అంటూ అంతా వాహనాల్లో బయలుదేరిపోతున్నారు. గతంలో చింతపల్లి మండలం లంబసింగిలో మాత్రమే మేఘాల లోకం ఆవిష్కృతమయ్యేది. ఆ తరువాత పాడేరు సమీపాన వంజంగి, అరకులోయ వద్ద మాడగడ కూడా సందర్శనీయ ప్రాంతాలుగా మారాయి. ఇంకా మరికొన్ని ప్రాంతాలు కూడా అందుబాటులోకి రావడంతో సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది.

వంజంగికి వారం రోజుల విరామం

శీతాకాలంలో అక్టోబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఏజెన్సీకి సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడం ఆనవాయితీ. ఈసారి డిసెంబరులో ఎక్కువ మంది రావడంతో సందర్శనీయ ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. రోజూ వేల సంఖ్యలు పర్యాటకులు రావడం, అందుకు తగ్గట్టుగా పారిశుద్ధ్య పనులు అక్కడ చేపట్టలేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వంజంగిలో సందర్శకులకు వారం రోజులు అనుమతించబోమని ఐటీడీఏ ప్రకటించింది. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఎవరినీ అక్కడికి రానీయకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టింది. సుమారుగా ఎనిమిది లారీల ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పార్శిల్‌ పొట్లాలు, ఇతరాలు వచ్చాయి.

విశాఖలో నేవీ మ్యూజియాలకు రద్దీ

విశాఖపట్నంలో కైలాసగిరితో పాటు ఆర్‌కే బీచ్‌లో నేవీ ఏర్పాటు చేసిన కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ-142, సీ హ్యారియర్‌ యద్ధ విమాన మ్యూజియాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని చూడడానికి పర్యాటకులు రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవున క్యూలు కట్టి నిల్చొన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు బెంగాలీలు ఎక్కువగా విశాఖ వస్తుంటారు. వారితో పాటు ఒడిశా, తెలంగాణా వారు కూడా జత కలిశారు.

ఉత్సవ్‌లు లేకున్నా...ఆదరణ

పర్యాటకులను ఆకర్షించడానికి విశాఖ ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌, భీమిలి ఉత్సవ్‌లతో పాటు వీఎంఆర్‌డీఏ ఫ్లవర్‌ షోలను జిల్లా యంత్రాంగం నిర్వహించేది. డిసెంబరులో జరిగే ఈ ఉత్సవ్‌లతోనే పండుగ వాతావరణం వచ్చేది. కరోనా తరువాత రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం మానేసింది. జిల్లా యంత్రాంగం కూడా ఖర్చుకు భయపడి, నిధులు లేక వెనకడుగు వేసింది. అయినా సరే పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం గమనార్హం.

Updated Date - Jan 21 , 2024 | 01:22 AM