పర్యాటకం కళకళ..
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:21 PM
విశాఖ మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.

ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి
వర్షాల్లోను తగ్గని సందర్శనలు
బొర్రాగుహలు, జలపాతాలు,
సుందర ప్రదేశాల్లో సందడి
అరకులోయ/అనంతగిరి, జూలై 28: విశాఖ మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గడంతో పర్యాటకులు బొర్రా గుహలు, జలపాతాలు, అరకులోయలోని అందాల ప్రదేశాలను సందర్శించారు. ఆంధ్రా ఊటీ అరకులోయ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. సందర్శిత ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, గాలికొండ వ్యూపాయింట్, రణజిల్లెడ జలపాతం పర్యాటకులతో కళకళలాడాయి. శని, ఆదివారం నుంచి పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకులు రాకతో అరకు-విశాఖ ప్రధాన రహదారి, అనంతగిరి ఘాట్‌రోడ్డు రద్దీగా మారింది.
అనంతగిరి మండలం బొర్రాగుహలకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు గుహలను తిలకించారు. ఈనెల 21వ తేదీ ఆదివారం బొర్రా గుహలను 1,449 మంది, 22వ తేదీన 821 మంది, 23వ తేదీన 568 మంది, 24వ తేదీన 538 మంది, 25వ తేదీన 711 మంది, 26వ తేదీన 712 మంది, 27వ తేదీన 1,565 మంది సందర్శించారు. ఆదివారం (28వ తేదీ) 1,900 మంది గుహలను సందర్శించగా రూ.1.54 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.