Share News

పర్యాటక జాతర

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:03 AM

ముక్కనుమ నాడు సైతం ఏజెన్సీలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనం ఊళ్లకే పరిమితమవుతారని అందరూ భావించినప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఊహించని విధంగా మన్యంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో వచ్చారు.

పర్యాటక జాతర
చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద సందడి

- మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు కిటకిట

- ముక్కనుమ నాడు పర్యాటకుల తాకిడి

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువులవేనం మేఘాల కొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం నెలకొంది. అయితే ప్రస్తుతం సంక్రాంతి పండుగ కావడంతో ఏజెన్సీలో భోజన హోటళ్ల నిర్వాహకులు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో ఏజెన్సీ వచ్చిన జనం భోజనాలకు ఇబ్బందులు పడ్డారు.

వంజంగి మేఘాల కొండపై..

పాడేరు రూరల్‌: జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి మేఘాల కొండకు బుధవారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు కావడంతో మన్యంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు కుటుంబ సమేతంగా, స్నేహితులతో పర్యాటకులు వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతం నుంచి, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వంజంగి మేఘాల కొండకు వచ్చారు. మంగళవారం సాయంత్రం పాడేరు చేరుకున్న పర్యాటకులు పాడేరు, వంజంగి ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు, రిసార్ట్స్‌, టెంట్‌లలో రాత్రి బస చేసి బుధవారం ఉదయం 5 గంటల సమయంలో వై.జంక్షన్‌ నుంచి మట్టి రోడ్డులో నడుచుకుంటూ మేఘాల పర్వతానికి చేరుకొని అక్కడ పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించి ఆనందంగా గడిపారు. సంక్రాంతి నేపథ్యంలో పాడేరులో హోటళ్లు గత మూడు రోజులుగా మూతపడడంతో మైదాన ప్రాంతం నుంచి వచ్చిన పర్యాటకులు భోజనం, టిఫిన్‌లకు ఇబ్బంది పడ్డారు.

బొర్రా గుహలు, అరకులోయలో..

అరకులోయ: ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన బొర్రా గుహలు, అరకులోయకు పర్యాటకులు బుధవారం అధిక సంఖ్యలో తరలి వచ్చారు. బొర్రా గుహలకు వచ్చిన సందర్శకులు పక్కనే ఉన్న జిప్‌లైనర్‌లో ప్రయాణించి ఎంజాయ్‌ చేశారు. అలాగే కటికి జలపాతం, ఘాట్‌ రోడ్డులోని అనంతగిరి, బీసుపురం, సుంకరమెట్ట కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్‌ వద్ద సందడి చేశారు. అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌లను సందర్శించారు. అరకు మండలంలోని మాడగడ సన్‌రైజ్‌ కొండకు బుధవారం వేకువజామునే చేరుకుని సూర్యోదయ అందాలను తమ కెమెరాల్లో బంధించారు. అక్కడ థింసా నృత్యం చేస్తూ ఉదయం పది గంటల వరకు సరదాగా గడిపారు.

చెరువులవేనంలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న చెరువులవేనం పర్యాటకులతో జాతర వాతావరణాన్ని తలపించింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. బుధవారం ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్దకు భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకున్నారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే వ్యూపాయింట్‌ పర్యాటకులతో కిటకిటలాడింది. సందర్శకులు మంచు అందాలను ఆస్వాదిస్తూ కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు చెరువులవేనంలో పర్యాటకులు మంచే మేఘాలను తిలకిస్తూ ఎంజాయ్‌ చేశారు. అలాగే తాజంగి జలాశయం, లంబసింగి జంక్షన్‌, యర్రవరం జలపాతం వద్ద పర్యాటకుల సందడి కనిపించింది.

కొత్తపల్లి జలపాతం వద్ద..

జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతం బుధవారం పర్యాటకులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఇక్కడ సందడి వాతవారణం నెలకొంది.

Updated Date - Jan 18 , 2024 | 12:03 AM