టామాటా ః 44
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:40 AM
టమాటా ధర మళ్లీ పెరుగుతోంది. ఇది సీజన్ ప్రారంభ సమయం. అలా చూసుకుంటే ధర దిగి రావాలి. కానీ వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. రైతుబజార్లలో కిలో టమాటా బుధవారం కిలో రూ.44 చొప్పున విక్రయించారు. ఈ నెల మొదటి వారంలో కిలో రూ.30కే లభించింది.

మళ్లీ పెరుగుతున్న ధర
వారం రోజుల్లో రూ.14 పెరుగుదల
తగ్గని ఉల్లి ఘాటు...కిలో రూ.56
విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
టమాటా ధర మళ్లీ పెరుగుతోంది. ఇది సీజన్ ప్రారంభ సమయం. అలా చూసుకుంటే ధర దిగి రావాలి. కానీ వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. రైతుబజార్లలో కిలో టమాటా బుధవారం కిలో రూ.44 చొప్పున విక్రయించారు. ఈ నెల మొదటి వారంలో కిలో రూ.30కే లభించింది. సరకు బాగా రావడంతో రిటైలర్లు ఆటోలో వేసుకొని మూడు కిలోలు వంద రూపాయల చొప్పున విక్రయించారు. ఇదంతా వారం క్రితం మాట. ఇప్పుడు రూ.44కి చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది రైతుబజార్ రేటు కాగా బయట మార్కెట్‌లో కిలో రూ.60పైనే అమ్ముతున్నారు. పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గిందని, డిమాండ్‌కు సరిపడా నిల్వలు రాకపోవడం వల్ల హోల్‌సేల్ మార్కెట్ మదనపల్లెలోనే రేటు పెరిగిందని చెబుతున్నారు. స్థానిక రైతులు వేసిన పంట కొద్దికొద్దిగా రావడం ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకో రెండు వారాలు ఆగితే జిల్లా రైతులు వేసిన టమాటా అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
తగ్గని ఉల్లి రేటు...కిలో రూ.56
ఉల్లిపాయల రేటు మార్కెట్‌లో దిగి రావడం లేదు. గత మూడు నెలలుగా కిలో రూ.50పైనే అమ్ముతున్నారు. రైతుబజార్లలో బుధవారం నాటి ధర కిలో రూ.56. ఇది షోలాపూర్ నుంచి తెచ్చిన సరకు అని చెబుతున్నారు. కర్నూలు ఉల్లి కిలో రేటు రూ.30 మాత్రమే ఉన్నా దానిని వ్యాపారులు తీసుకురావడం లేదు. అది ఇప్పుడే కోతకు వచ్చిన పంట అని, నిల్వ ఉండదని అంటున్నారు. ఏదేమైనా రెండు రకాలు అందుబాటులో ఉంచితే ఎవరికి నచ్చింది వారు కొనుగోలు చేస్తారని, మార్కెటింగ్ శాఖాధికారులు దీనిపై దృష్టి పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.