మళ్లీ టోల్‌గేట్
ABN , Publish Date - Jul 18 , 2024 | 01:09 AM
అగనంపూడి వద్ద టోల్‌గేట్‌ను మళ్లీ ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ టోల్‌గేట్‌ను తొలగించాలంటూ కొద్దిరోజుల కిందట స్థానికులు, కూటమి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరుసటిరోజు రాత్రి టోల్‌ప్లాజాను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి అక్కడ టోల్‌గేట్ లేదు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, సున్నితమైన వ్యవహారం కావడంతో పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.
అగనంపూడి తొలగించిన టోల్‌గేట్‌ను పునరుద్ధరించేందుకు
సిద్ధమవుతున్న నేషనల్ హైవే అథారిటీ
టోల్ వసూళ్లకు టెండర్లు ఆహ్వానం
ఏడాదికి రూ.81 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
స్థానికుల ఆగ్రహం
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
అగనంపూడి వద్ద టోల్‌గేట్‌ను మళ్లీ ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ టోల్‌గేట్‌ను తొలగించాలంటూ కొద్దిరోజుల కిందట స్థానికులు, కూటమి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరుసటిరోజు రాత్రి టోల్‌ప్లాజాను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి అక్కడ టోల్‌గేట్ లేదు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, సున్నితమైన వ్యవహారం కావడంతో పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో టోల్‌గేట్ బెడద తొలగపోయిందంటూ స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. అయితే, ఈ టోల్‌గేట్‌ను మళ్లీ పెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టోల్ వసూలుకు టెండర్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల పదో తేదీన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం అగనంపూడి టోల్‌గేట్ ద్వారా ఏడాదికి రూ.81 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసిన ఎన్‌హెచ్‌ఏఐ..అందుకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించింది. అక్కడ వసూలుచేసే ఫీజులకు సంబంధించిన వివరాలను టెండర్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్‌కు వన్ వే ట్రిప్‌నకు రూ.65, రెండు వైపులా అయితే రూ.95, ఈ వాహనాలు నెలలో 50సార్లు ప్రయాణించేందుకు రూ.2,155, జిల్లా స్థాయిలో రిజిస్టర్ అయిన కమర్షియల్ వాహనాలకు రూ.30 చొప్పున నిర్ణయించారు. అలాగే, లైట్ కమర్షియల్ వెహికల్, లైట్ గూడ్స్ వెహికల్, మినీ బస్సులకు ఒక ట్రిప్‌నకు రూ.105, రెండువైపులా అయితే రూ.155, నెలకు 50సార్లు ప్రయాణించేందుకు రూ.3,485, జిల్లా స్థాయిలో రిజిస్టర్ అయిన వాహనాలకు రూ.50 ఫీజుగా నిర్ణయించారు. అదేవిధంగా బస్సు, ట్రక్ వంటి వాహనాలు ఒక ట్రిప్‌నకు రూ.220, రిటర్న్ ట్రిప్‌నకు రూ.330, నెలకు 50సార్లు తిరిగేందుకు రూ.7,300, జిల్లా పరిధిలోని రిజిస్టర్ అయిన వాటికి రూ.110గా, కమర్షియల్ వాహనాలు (మూడు చక్రాలు) ఒక ట్రిప్‌నకు రూ.240, రిటర్న్ ట్రిప్‌కు రూ.360, నెలకు 50సార్లు ప్రయాణాలు సాగించేందుకు రూ.7,965, జిల్లా స్థాయిలో రిజిస్టర్ అయిన వాటికి రూ.120 చొప్పున వసూలు చేయనున్నారు. హెవీ కనస్ట్రక్షన్ మెషీన్లతో కూడిన వాహనాలతోపాటు ఇతర వాహనాలకు కొన్నిరకాల చార్జీలను నిర్ధారించి వసూలు చేసేలా టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెండర్లు వేసేందుకు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలు తుదిగడువుగా పేర్కొంది. ఈ నెల 25వ తేదీ ఉదయం 11.30 గంటలకు టెండర్లు తెరవనున్నారు.
సీఎం దృష్టికి తీసుకువెళ్లిన నేషనల్ హైవే అధికారులు
అగనంపూడి టోల్‌గేట్ వ్యవహారాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ టోల్‌గేట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రానున్న కాలంలో ఫ్లై ఓవర్లు, బస్, లారీ బేల నిర్మాణం, రోడ్డు మరమ్మతులు, నిర్వహణకు వినియోగిస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే, ఈ విషయంపై సీఎం ఎలా స్పందించారన్నది తెలియాల్సి ఉంది. ఇదిలావుండగా టోల్‌గేట్‌కు అధికారులు టెండర్లు ఆహ్వానించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై మళ్లీ పోరాటం చేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు.
దీనిపై స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ ప్రకటన చేయడం దారుణమన్నారు. ఇక్కడ టోల్‌గేట్ ఏర్పాటుచేస్తే ప్రజాగ్రహానికి గురికావాల్సి ఉంటుందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని టోల్‌గేట్ ఏర్పాటుపై అధికారులు పునరాలోచన చేయాలన్నారు. ఎన్‌హెచ్16కు బదులు ఎన్‌హెచ్ 5 అంటూ పేర్కొనడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.