Share News

మోదకొండమ్మకు నీరాజనం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:51 AM

గిరి పుత్రుల ఆరాధ్య దేవత, కొండదేవరగా కొలిచే మోదకొండమ్మ ఉత్సవాలు మంగళవారంతో పరిసమాప్తమయ్యాయి. పాడేరులో మూడు రోజులు నిర్వహించిన ఉత్సవాలకు అనుపోత్సవంతో ముగింపు పలికారు. తొలిరోజు ఉత్సవ విగ్రహం, పాదాలును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకు వచ్చి శతకంపట్టు వద్ద కొలువు తీర్చడంతో ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కుబడుల సమర్పణ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాడేరు అంతటా సందడి వాతావరణం నెలకొంది. మన్యంలోని వివిధ ప్రాంతాలతో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో పాడేరు వీధులు జనసంద్రాన్ని తలపించాయి. పగలు, రాత్రి లేకుండా భక్తుల రాకపోకలతో ఆలయం పరిసరాలు కిక్కిరిశాయి.

మోదకొండమ్మకు   నీరాజనం
మోదకొండమ్మకు ఘటాలు సమర్పిస్తున్న భక్తులు

అనుపోత్సవంతో ఘనంగా ముగిసిన ఉత్సవాలు

విశేషంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు

కిక్కిరిసిన పాడేరు వీధులు

ఘటాలతో భారీ ఊరేగింపు

సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ, ఐటీడీఏ పీవో

(పాడేరు, ఆంధ్రజ్యోతి)

గిరి పుత్రుల ఆరాధ్య దేవత, కొండదేవరగా కొలిచే మోదకొండమ్మ ఉత్సవాలు మంగళవారంతో పరిసమాప్తమయ్యాయి. పాడేరులో మూడు రోజులు నిర్వహించిన ఉత్సవాలకు అనుపోత్సవంతో ముగింపు పలికారు. తొలిరోజు ఉత్సవ విగ్రహం, పాదాలును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకు వచ్చి శతకంపట్టు వద్ద కొలువు తీర్చడంతో ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కుబడుల సమర్పణ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాడేరు అంతటా సందడి వాతావరణం నెలకొంది. మన్యంలోని వివిధ ప్రాంతాలతో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో పాడేరు వీధులు జనసంద్రాన్ని తలపించాయి. పగలు, రాత్రి లేకుండా భక్తుల రాకపోకలతో ఆలయం పరిసరాలు కిక్కిరిశాయి.

ఉత్సవాలకు మంగళవారం చివరి రోజు కావడంతో శతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలును తిరిగి ఆలయంలో చేర్చడంతో ముగిశాయి. జిల్లా కలెక్టర్‌ ఎం.విజయసునీత, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, భాగ్యలక్ష్మి ఉత్సవ విగ్రహం, పాదాలు, తల్లి ఘటాలు తలకెత్తుకుని అనుపోత్సవాన్ని ప్రారంభించారు. శతకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు నిర్వహించే ఊరేగింపులో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన నేలవేషాలు, డప్పుల మోతలు, తీన్‌మార్‌ బ్యాండ్‌ భక్తులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపులో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి అమ్మవారికి అధికసంఖ్యలో మొక్కుబడులు తీర్చుకున్నారు. కుటుంబాలతో సహా భక్తులు ఘటాలను శిరసున దాల్చి ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువచ్చి మోదకొండమ్మకు సమర్పించారు. మొక్కుబడిలో భాగంగా పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. ఉత్సవాల్లో జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ఠ, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొట్టగుళ్లి రామారావు, ప్రధాన కార్యదర్శులు టి.ప్రసాదరావునాయుడు, వై.శ్రీను, కె.వెంకటరమణ, సభ్యులు వి.రాజబాబు, డి.బాబూరావు, వి.వెంకటరత్నం, ముకుందరావు, ఎస్‌.శ్రీనివాసకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫొటో రైటప్స్‌, 11పిడిఆర్‌ రూరల్‌ 3: మోదకొండమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌

పట్టు వస్త్రాలు సమర్పించిన ఐటీడీఏ పీవో

పాడేరురూరల్‌: మోదకొండమ్మ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవోలు వీఎస్‌.ప్రభాకర్‌, ఎం.వెంకటేశ్వరరావు, ఏవో ఎం.హేమలత, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:51 AM