Share News

అమర్‌కు అవకాశం దక్కేనా?

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:33 AM

రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందా?, లేదా?...అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, ఒకటి, రెండు మార్పులతో ఆఖరి జాబితా త్వరలో విడుదల చేస్తామని అన్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి అమర్‌నాథ్‌కు ఇప్పటివరకూ ఏ నియోజకవర్గం కేటాయించలేదు.

అమర్‌కు  అవకాశం దక్కేనా?

పార్టీలో జోరుగా చర్చ

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి

మలసాల భరత్‌ను ఇన్‌చార్జిగా ప్రకటించిన అధిష్ఠానం

చోడవరం, ఎలమంచిలి వైపు మంత్రి చూపు

వ్యతిరేకించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు

స్వయంకృతాపరాధమేనంటున్న అనుచరవర్గం

అనకాపల్లి నుంచి తప్పుకుంటానని

సీఎంకు స్వయంగా ఆయనే చెప్పినట్టు ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందా?, లేదా?...అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, ఒకటి, రెండు మార్పులతో ఆఖరి జాబితా త్వరలో విడుదల చేస్తామని అన్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి అమర్‌నాథ్‌కు ఇప్పటివరకూ ఏ నియోజకవర్గం కేటాయించలేదు. దాంతో ఆయన పరిస్థితి ఏమిటని ఆయన అనుచరవర్గం ఆందోళన చెందుతోంది. అంతా ఆయన స్వయంకృతాపరాధమేనని అంటోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమర్‌ నియోజకవర్గం (అనకాపల్లి)లో ‘సొంత వర్గం’ తయారుచేసుకున్నారు. ఇంకా భూముల వ్యవహారాలు, ఆర్‌ఈసీఎస్‌లో అడ్డగోలు నియామకాల్లో ఆయన పేరు వినిపించింది. ఇక తన శాఖల నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాకు చేసిన మేలు ఏమీ లేకపోవడంతో పారిశ్రామిక వర్గాలు కూడా ఆయనకు ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. పార్టీలో చిన్న పదవి వస్తే ఆ సామాజికవర్గం అంతా కలిసి భారీ సన్మానాలు చేయడం రివాజుగా మారింది. కానీ అమర్‌నాథ్‌కుమంత్రి పదవి వచ్చిన తరువాత తన సొంత సామాజికవర్గంలో నేటి వరకు ప్రత్యేకంగా గౌరవించి, సన్మానం చేయకపోవడం గమనార్హం. అధికారం చేపట్టగానే నోటికి వచ్చినట్టు మాట్లాడడమే అందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగా పార్టీలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభం కాగానే పార్టీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అమర్‌ కలిసి...‘తనకు అనకాపల్లి కాకుండా వేరే నియోజకవర్గం ఏదైనా కేటాయించండి’ అని స్వయంగా కోరినట్టు సమాచారం. దీంతో పెందుర్తి, ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల నుంచి అమర్‌ పోటీ చేస్తే ఎలా ఉంటుంది?...అనే అంశంపై సర్వే చేయించారు. ఈ విషయం తెలిసి చోడవరం, ఎలమంచిలి ఎమ్మెల్యేలు గట్టిగా వ్యతిరేకించడంతో అమర్‌కు ఇప్పటివరకూ ఎక్కడా సీటు ఖరారు చేయలేదు.

మలసాలకు సిఫారసు

అనకాపల్లి నుంచి నువ్వు పోటీ చేయకపోతే ఎవరైతే బాగుంటుందో సూచించాలని సీఎం కోరినప్పుడు...అన్ని విధాలా తనకు విశ్వాసపాత్రుడిగా ఉండే మలసాల భరత్‌ని తీసుకువెళ్లి సీఎంకు పరిచయం చేశారు. దాంతో భరత్‌నే నియోజకవర్గ ఇన్‌చార్జిని చేశారు. అలా అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం పోయింది. ఇక ఎలమంచిలిలో తన కుటుంబాన్ని కాదని అమర్‌కు టికెట్‌ ఇస్తే...ఆయన ఓటమికే పనిచేస్తానని సిట్టింగ్‌ ఎమ్మెల్యే కన్నబాబురాజు అధిష్ఠానానికి చెప్పినట్టు ప్రచారం జరిగింది. దాంతో అక్కడ కూడా అవకాశం పోయింది. చోడవరంలో తనను తప్పించి ఎవరికి ఇచ్చినా ఓకే గానీ...అమర్‌కు ఇస్తే మాత్రం ఒప్పుకొనేది లేదని ధర్మశ్రీ పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలో దింపడానికి అధిష్ఠానం ఆలోచన చేస్తున్నదంటూ అనుచరులు చెబుతున్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిత్వం కోసం సిట్టింగ్‌ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు విశాఖ డెయిరీ దివంగత చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి కూడా ప్రయత్నిస్తున్నారు.

నా గురించి జగన్‌ చూసుకుంటారు

టికెట్‌పై ఒకటి, రెండుసార్లు మంత్రి వద్ద విలేకరులు ప్రస్తావించగా...తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం జగన్‌ చూసుకుంటారని, ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని, లేదంటే పార్టీ కోసం పనిచేస్తానని, దేనికైనా సిద్ధమేనని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారం కిందట అమర్‌ను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ డిప్యూటీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందో, లేదో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Feb 15 , 2024 | 01:33 AM