Share News

లబ్ధిదారులకు ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లు

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:30 PM

టిడ్కో ఇళ్లను ఆరు నెలల్లో లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందన్నారు.

లబ్ధిదారులకు ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లు

కొమ్మాది, జూన్‌ 20 : టిడ్కో ఇళ్లను ఆరు నెలల్లో లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందన్నారు. గురువారం ఆయన లబ్ధిదారుల, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బక్కన్నపాలెంలో గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఆరు ఎకరాల్లో ఎనిమిది బ్లాకుల్లో 380 ఇళ్లు నిర్మించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్నో బాధలు అనుభవించిన రప్రజలు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుతోనే సాధ్యమని భావించి తమదైన శైలిలో చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారన్నారు. అప్పటి టీడీపీ ప్రభు త్వం అత్యాధునికమైన షేర్‌ వాల్‌ టెక్నాలజీతో భూకంపాలను కూడా తట్టుకునేలా టిడ్కో ఇళ్లు నిర్మించిందని, పనులు చివరి దశలో ఉన్న సమయంలో 2019 ఎన్నికల్లో తాము అధికారం కోల్పోవడంతో వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. వారి నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని విమర్శించారు. టీడీపీకి మంచి పేరు రాకూడదని పోలవరం, అమరావతి, టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఇళ్ల లోపలికి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో ఇళ్లను పరిశుభ్రం చేసి, లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులకు 2018లో తెలుగు సినీ పరిశ్రమ నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్లను కూడా లబ్థిదారులకు అందచేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, చిక్కాల విజయ్‌బాబు, జోన్‌-2 కమిషనర్‌ శైలజావాణి, ఈఈ శాంతిరాజు, టిడ్కో ఎస్‌ఈ నరసింహమూర్తి, ఈఈ సుధాకర్‌, పీఓ లక్ష్మి, స్థానిక నాయకులు జీవన్‌కుమార్‌, దాసరి శ్రీనివాస్‌, గరె గురునాథ్‌, గొల్లంగి ఆనందబాబు, గొలగాని సన్యాసిరావు, పోతిన శివ, మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు ,పోతిన రఘు, వాండ్రాసి అప్పలనాయుడు, లొడగల జానకీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 11:30 PM