దడ పుట్టించే దారి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:50 PM
మండలంలోని అసకపల్లి- లంకెలపాలెం రోడ్డుపై ఏర్పడిన గోతులు చెరువులను తలపిస్తున్నాయి. గత మూడేళ్లుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్ అండ్ బీ అధికారులు ఈ రోడ్డును పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గోతులమయంగా అసకపల్లి- లంకెలపాలెం రోడ్డు
తరచూ ప్రమాదాలు
పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
సబ్బవరం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని అసకపల్లి- లంకెలపాలెం రోడ్డుపై ఏర్పడిన గోతులు చెరువులను తలపిస్తున్నాయి. గత మూడేళ్లుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్ అండ్ బీ అధికారులు ఈ రోడ్డును పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడఅగ్రహారం, పెదముషిడివాడ తదితర గ్రామాల వద్ద రోడ్డుపై భారీగా గోతులు ఏర్పడడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ఇటుగా ప్రయాణ మంటే వాహనచోదకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మార్గం గోతుల మయంగా ఉండడంతో లంకెలపాలెం, పరవాడ వెళ్లే వాహనచోదకులు అనకాపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే గాజువాక నుంచి సబ్బవరం రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సు కొన్ని రోజులుగా ఈ మార్గంలో తిరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కాగా మూడు రోజుల క్రితం లంకెలపాలెం వైపు నుంచి సబ్బవరం వస్తున్న వ్యాన్ ఎరుకునాయుడు పాలెం సమీపంలో బోల్తా పడింది. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా పరిస్థితిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎస్‌ఆర్ నిధులతో పనులు చేపట్టాలని..
అసకపల్లి- లంకెలపాలెం రోడ్డు మరమ్మతులకు సంబంధించి పెదముషిడివాడ వరకు పనులు చేశామని ఆర్ అండ్ బీ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సబ్బవరం పరిధిలో రోడ్డుపై భారీగా గోతులు ఏర్పడడంతో ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఎంపీ సీఎం రమేశ్‌లు ఎన్టీపీసీ నుంచి సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) నిధులు అడిగారని, ఎన్టీపీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. వారు నిధులు మంజూరు చేస్తే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.