Share News

దడ పుట్టించే దారులు

ABN , Publish Date - May 31 , 2024 | 12:52 AM

జిల్లాలోని పలు రహదారులు అడుగడుగునా గోతులతో నరకాన్ని తలపిస్తున్నాయి. వాహనచోదకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల అంతర్‌ రాష్ట్ర రహదారిలో, అలాగే కొయ్యూరు మండలంలోని కొంగశింగి- డేగలపాలెం మార్గంలో ప్రయాణమంటే హడలిపోతున్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు న్నాయి.

దడ పుట్టించే దారులు
గోతులమయంగా సీలేరు- డొంకరాయి ప్రధాన రహదారి

- గోతులమయంగా సీలేరు- పాలగెడ్డ రహదారి

- అధ్వానంగా కొయ్యూరు మండలంలోని డేగలపాలెం రోడ్డు

- రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

- వాహనచోదకులకు తప్పని అవస్థలు

సీలేరు/కొయ్యూరు, మే 30: జిల్లాలోని పలు రహదారులు అడుగడుగునా గోతులతో నరకాన్ని తలపిస్తున్నాయి. వాహనచోదకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల అంతర్‌ రాష్ట్ర రహదారిలో, అలాగే కొయ్యూరు మండలంలోని కొంగశింగి- డేగలపాలెం మార్గంలో ప్రయాణమంటే హడలిపోతున్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు న్నాయి.

సీలేరు నుంచి పాలగెడ్డ వరకు ఉన్న అంతర్‌ రాష్ట్ర రహదారి అడుగడుగునా గోతులమయంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. 20 కిలో మీటర్ల ప్రయాణానికి సుమారు రెండు గంటల సమయం పడుతోందని వాపోతున్నారు. గూడెంకొత్తవీధి నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు గల రహదారి ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలను కలిపే అంతర్‌ రాష్ట్ర సింగిల్‌ లైన్‌ రహదారి. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జీకేవీధి మండలం ఆర్వీనగర్‌ నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు గల 70 కిలోమీటర్ల రహదారిని రెండు లైన్లుగా విస్తరించడానికి టెండర్లు పిలిచారు. అయితే ఈ రహదారి ప్రాంతమంతా రిజర్వు ఫారెస్టులో ఉండడంతో అటవీశాఖ నుంచి అనుమతులు రాక పనులు జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ అండ్‌ బీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడం తో ఈ రహదారి విస్తరణకు నోచుకోలేదు. కనీసం మరమ్మతులు కూడా జరగలేదు. దీంతో ఆర్వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న 70 కిలోమీటర్ల రహదారి అడుగడుగునా గోతులతో ప్రయాణం నరకాన్ని తలపించేది.

గత కలెక్టర్‌ చొరవతో కొంత వరకు అభివృద్ధి

రహదారి దుస్థితిపై పలుమార్లు ఈ ప్రాంతవాసులు ఆందోళనలు చేయడంతో అప్పటి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ జాతీయ ఉపాధి హామీ నిధులతో సప్పర్ల నుంచి నూతిబంద వరకు గల 13 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. సీలేరు నుంచి ధారకొండ వరకు ఉన్న 17 కిలోమీటర్ల రహదారిలో బాగా గోతులమయమైన ప్రాంతాల్లో 12 కిలోమీటర్ల రహదారి పనులు చేయించారు. అయితే ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల 20 కిలోమీటర్ల రహదారి పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ రహదారి అంతా అడుగడుగునా గోతులతో వర్షాలు కురిస్తే అధ్వానంగా తయారవుతున్నాయి. గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవు తున్నారు. ఇది మూడు రాష్ర్టాలను కలిపే రహదారి కావడంతో పాటు అరకు, లంబసింగి, ధారాలమ్మ ఆలయం, సీలేరు జల విద్యుత్‌ కేంద్రాలను సందర్శించేందుకు పర్యాటకులు ఈ మార్గంలోనే వస్తారు. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ రహదారి అధ్వానంగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 20 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు రెండు గంటల సమయం పడుతోందని, దీనికి తోడు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి కనీసం గోతులను పూడ్చాలని వారు కోరుతున్నారు.

అధ్వానంగా డేగలపాలెం రహదారి

కొయ్యూరు మండలంలోని డేగలపాలెం ప్రధాన రహదారి దారుణంగా ఉంది. కృష్ణాదేవిపేట నుంచి కొంగశింగి మీదుగా డేగలపాలెం వెళ్లే ఈ రహదారిలో అడుగడుగునా గోతులు దర్శనమిస్తున్నాయి. కొంగశింగి దాటిన తరవాత ఇటీవల కిలోమీటరు మేర బీటీ రోడ్డు నిర్మించారు. డేగలపాలెం వరకు గల ఐదు కిలోమీటర్ల రహదారికి కనీస మరమ్మతులు చేయకుండా వదిలారు. దశాబ్దం క్రితం చోద్యం- చింతలపూడి ప్రధాన రహదారి నుంచి డేగలపాలెం మీదుగా కొమ్మిక రహదారిని కలుపుతూ కృష్ణాదేవిపేటకు బీటీ రోడ్డు నిర్మించారు. బాలారం, కంఠారం, బకులూరు, కొమ్మిక పంచాయతీలకు చెందిన సుమారు 20 గ్రామాలు కృష్ణాదేవీపేటకు వచ్చేందుకు ఇది దగ్గరి దారి. ప్రస్తుతం ఈ రహదారి కొంగశింగి దాటాక కిలోమీటరు మేర రోడ్డు బాగున్నా అక్కడ నుంచి చోద్యం- చింతలపూడి ప్రధాన రహదారి చేరే వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వర్షాలు కురిస్తే గోతుల్లో నీరు నిలిచిపోయి వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది నవంబరులో కొమ్మిక పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దృష్టికి ఈ రహదారి విషయాన్ని తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రహదారి అధ్వానంగా ఉండడంతో అత్యవసర సమయాల్లో అదనంగా మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణాదేవిపేట చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారి మరమ్మతులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:52 AM