Share News

ముగ్గురు భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర గాయాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:47 PM

అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెం గ్రామంలో ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా డెక్కింగ్‌ కర్రలు విరిగి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

ముగ్గురు భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర గాయాలు
డెక్కింగ్‌ కర్రలు విరిగిపడిన దృశ్యం

డెక్కింగ్‌ కర్రలు విరగడంతో ప్రమాదం

కొత్తూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెం గ్రామంలో ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా డెక్కింగ్‌ కర్రలు విరిగి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి అనకాపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాలివి. కాపుశెట్టివానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం రెండో అంతస్థులో బయట నుంచి ప్లాస్టింగ్‌ చేసేందుకు డెక్కింగ్‌ కర్రలను భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం పనిచేస్తుండగా కర్రలు ఒక్కసారిగా విరగడంతో శ్రీకాకుళం జిల్లా నౌపడకు చెందిన లోపింటి సోమేశ్వరరావు, నౌపడ మండలం పాతలింగుడు గ్రామానికి చెందిన జేరు చిన్నారావు, రాయగడకు చెందిన కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఇటీవల కురిసిన వర్షానికి ఆ డెక్కింగ్‌ కర్రలు నానిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అంటున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:47 PM