Share News

మిరియాల నర్సరీల అభివృద్ధికి ఇదే అదును

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:33 AM

మిరియాల నర్సరీల అభివృద్ధికి ఇదే అదునని ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీతోటల్లో అంతర పంటగా మిరియాల సాగు చేపడుతున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 98 ఎకరాల్లో రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారు. ఆదివాసీ రైతులను మిరియాల పంట ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో ఐటీడీఏ, ఉద్యానశాఖ అధికారులు మిరియాల సాగును విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీలో ప్రధాన అంతర పంట అయిన మిరియాల సాగులో నర్సరీల అభివృద్ధికి ఏప్రిల్‌లో పలు రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టాలని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త తెలిపారు.

మిరియాల నర్సరీల అభివృద్ధికి ఇదే అదును
పరిశోధన స్థానంలో పెంపొందిస్తున్న నర్సరీ బ్యాగులు

- ప్రధాన మొక్కల నుంచి రన్నర్స్‌ను సేకరించుకోవాలి

- రైతులకు నూతన రకాలు పంపిణీ

- శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌

చింతపల్లి, మార్చి 28: మిరియాల నర్సరీల అభివృద్ధికి ఇదే అదునని ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీతోటల్లో అంతర పంటగా మిరియాల సాగు చేపడుతున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 98 ఎకరాల్లో రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారు. ఆదివాసీ రైతులను మిరియాల పంట ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో ఐటీడీఏ, ఉద్యానశాఖ అధికారులు మిరియాల సాగును విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీలో ప్రధాన అంతర పంట అయిన మిరియాల సాగులో నర్సరీల అభివృద్ధికి ఏప్రిల్‌లో పలు రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టాలని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త తెలిపారు.

నర్సరీ బ్యాగులు సిద్ధం చేసుకోవాలి

మిరియాల నాట్లు వేసుకోవాలని ఆశించిన రైతులు తొలుత నర్సరీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలి. బ్యాగుల్లో నింపుకునేందుకు అవసరమైన మట్టి మిశ్రమాన్ని ఎర్ర మట్టి(మెత్తనిమట్టి), పశువులగెత్తం, ఇసుక 1:1:1 నిష్పత్తిలో(మూడూ సమపాళ్లలో) కలుపుకుని సిద్ధంచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నర్సరీ బ్యాగుల్లో నింపుకోవాలి.

రన్నర్స్‌ సేకరణ

మిరియా నర్సరీలను పెంపొందించుకునేందుకు ప్రధాన మొక్క నుంచి రన్నర్స్‌ను తీసుకోవాలి. మొక్క అడుగు భాగంలో భూమికి సమాంతరంగా వ్యాప్తిచెందిన రన్నర్స్‌ను తీసుకోవాలి. ఈ రన్నర్‌ ఇరువైపులా 10 సెంటీ మీటర్లు కత్తిరించి తొలగించుకోవాలి. రన్నర్‌ను రెండు కణుపులుండే విధంగా చిన్నకొమ్మలుగా కత్తిరించుకోవాలి. ఒక కణుపు నర్సరీ బ్యాగు లోపల వుండే విధంగా బ్యాగుల్లో నాటుకోవాలి. ఈ నర్సరీ బ్యాగుల్లో మొక్కల్లో 80 శాతం తేమ వుండే విధంగా నీటి తడులు పెట్టుకోవాలి. గాలి, వెలుతురు తగిలే విధంగా ఈ నర్సరీ బ్యాగులను నీడలో పెట్టుకోవాలి. 90 రోజులు తరువాత జూలై- ఆగస్టు మాసాల్లో నాట్లు వేసుకోవాలి.

రెండు మొక్కలు చొప్పున నాట్లు

మిరియాల మొక్కలు నాట్లు వేసుకునేందుకు ముందుగా పెంచుకున్న నీడనిచ్చే మొక్కలకు రెండువైపులా రెండు మొక్కలను నాటుకోవాలి. మొక్కలు నాటుకునేందుకు 45 సెంటీమీటర్లు లోతు, వెడల్పు, పొడవు కలిగిన గోతులు తవ్వుకోవాలి. పశువుల గెత్తం, ఎర్రమట్టి సమపాళ్లలో కలుపుకుని ఈ గోతుల్లో నింపుకోవాలి. జూలై- ఆగస్టు మాసాల్లో ఈ గోతుల్లో మిరియాల మొక్కలను నాటుకునేందుకు సిద్ధం చేసుకోవాలి.

పన్నీయూర్‌-1 అనుకూలం

గిరిజన ప్రాంతానికి పన్నీయూర్‌-1 రకం అనుకూలమని ఉద్యాన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎకరాకు 500 కిలోలు పైబడి దిగుబడి వస్తుంది. ఒక గుత్తిలో సుమారు 125 గింజలుంటాయి.

మిరియాల తోటల సస్యరక్షణ

కాపునిస్తున్న మిరియాల తోటల్లోనూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా మిరియాల మొక్కల చుట్టూ పెరిగిన కలుపును తొలగించుకోవాలి. అలాగే ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు నియంత్రించుకునేందుకు బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. అలాగే ట్రైకోడెర్మవిరిడి కలిపిన పశువుల గెత్తం మిశ్రమం మొక్కలకు 2- 3 కిలోలు పెట్టుకోవాలి.

బోర్డు మిశ్రమం తయారీ విధానం

మిరియాల మొక్కలకు ఒక శాతం బోర్డు మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. కిలో మైలుతుత్తం(కాఫర్‌ సల్ఫేట్‌) ఐదులీటర్ల నీటిలోనూ, ఒక కిలో వ్యవసాయ సున్నం మరో ఐదు లీటర్ల నీటిలో కలుపుకోవాలి. సున్నం, మైలుతుత్తం మిశ్రమాలను 90 లీటర్ల నీటిలో కలుపుకుని మిరియాల మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. అలాగే మొక్కల మొదళ్లలోనూ పోసుకోవాలి. ఎకరాకు 100 లీటర్ల బోర్డు మిశ్రమం అవసరమవుతుంది.

ఎరువు తయారీ

ట్రైకోడెర్మా విరిడి, వేపపిండి, పశువుల గెత్తం కలుపుకుని ఎరువును తయారుచేసుకోవాలి. 100 కిలోల పశువుల గెత్తం, 10 కిలో వేపపిండి, ఒక కిలో ట్రైకోడెర్మావిరిడి కలుపుకున్న మిశ్రమానికి నీరు చిలకరించుకోవాలి. పది రోజులపాటు మిశ్రమాన్ని నీడలో పెట్టుకుని నీటిని చిలకరిస్తుండాలి. ఈ విధంగా తయారుచేసుకున్న ఎరువును చిరుజల్లులు పడిన సమయంలో మొక్కల మొదళ్లలో వేసుకోవాలి.

Updated Date - Mar 29 , 2024 | 12:33 AM