Share News

పింఛన్‌కు తప్పని పాట్లు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:47 AM

మునిసిపాలిటీలో పింఛన్‌ లబ్ధిదారులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పలేదు. మునిసిపాలిటీ పరిధిలో సుమారు ఏడు వేల మంది లబ్ధిదారులు ఉండగా, ఐదు వేల మందికి ప్రభుత్వం బ్యాంకుల్లో నగదు జమ చేసింది. మరో 1,958 మంది ఇళ్లకు వెళ్లి పింఛన్‌ అందిస్తారు.

పింఛన్‌కు తప్పని పాట్లు
నర్సీపట్నంలో పింఛన్‌ డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకులో బారులుతీరిన లబ్ధిదారులు

- బ్యాంకుల వద్ద బారులుతీరిన లబ్ధిదారులు

- దూర ప్రాంతాల నుంచి వేకువజామునే కొందరు వృద్ధుల రాక

- గంటల తరబడి పడిగాపులు

నర్సీపట్నం, జూన్‌ 1: మునిసిపాలిటీలో పింఛన్‌ లబ్ధిదారులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పలేదు. మునిసిపాలిటీ పరిధిలో సుమారు ఏడు వేల మంది లబ్ధిదారులు ఉండగా, ఐదు వేల మందికి ప్రభుత్వం బ్యాంకుల్లో నగదు జమ చేసింది. మరో 1,958 మంది ఇళ్లకు వెళ్లి పింఛన్‌ అందిస్తారు.

కాగా బ్యాంకు ఖాతాలో జమ చేసిన పింఛన్‌ డబ్బుల కోసం వృద్ధులు, వితంతువులు ఖాతా పుస్తకాలు, ఆధార్‌ కార్డులు పట్టుకొని శనివారం ఉదయం 10 గంటల నుంచి బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. దూర ప్రాంతాల నుంచి కొందరు వేకువజామునే వచ్చారు. దీంతో బ్యాంకులన్నీ పెన్షన్‌ లబ్ధిదారులతో కిటకిటలాడాయి. విత్‌డ్రా ఫారం రాయడం రాక మరొకరి మీద ఆధార పడాల్సి వచ్చింది. తరువాత గంటల తరబడి క్యూలో ఉన్నారు. రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన రొంగలి నూకరాజు పెన్షన్‌ డబ్బుల కోసం గంటల తరబడి క్యూలో ఉన్నాడు. వ్యవసాయ రుణం వడ్డీకి పెన్షన్‌ సొమ్ము జమ అయిపోయిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఉసూరుమంటూ ఇంటికి వెనుతిరిగాడు.

Updated Date - Jun 02 , 2024 | 12:47 AM