గ్రీన్ బెల్టును రాసిచ్చేశారు!
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:54 AM
‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు’గా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యవహరించింది.

ఏఎస్‌ఎన్ షాపింగ్ మాల్‌కు అనుచిత లబ్ధి
హైవే నుంచి రెండు రహదారుల నిర్మాణానికి రూ.2 లక్షలు కట్టించుకుని
అనుమతులు ఇచ్చేసిన ఎన్‌హెచ్‌ఐ
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
మాల్ యాజమాన్యం ఆధీనంలో రూ.18.66 కోట్ల విలువైన నగర పాలక సంస్థ భూమి
పట్టించుకోని అధికారులు
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా చర్యలకు మీనమేషాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు’గా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యవహరించింది. తనకు సంబంధం లేని వ్యవహారంలో నామమాత్రపు ఫీజు కట్టించుకుని అనుమతులు ఇచ్చి పడేసింది. సొంత భూమిని కాపాడుకోవలసిన జీవీఎంసీ మొక్కల లెక్కలు వేసిందే తప్ప బొక్కసానికి పడిన గండిని గుర్తించలేదు. ఏఎస్‌ఎన్ షాపింగ్‌మాల్ వ్యవహారంలో రెండు సంస్థలు కలిసి చేసిన మేలు ఇది.
కప్పరాడలో ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపాన జాతీయ రహదారిని ఆనుకుని అలక్రమం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ ‘ఏఎస్‌ఎన్ మెగా మాల్’ పేరుతో భారీ భవన నిర్మాణం చేపట్టింది. నిర్మాణం ముందు అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు పెట్టి అక్కడకు ప్రశ్నించేవారు ఎవరూ రాకుండా కట్టడి చేసేవారు. గతంలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్ ఫొటో ఉపయోగించారు. ఇప్పుడు కూటమి నాయకులు ఫొటోలు పెట్టారు. ఈ విషయం తెలిసి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు రెండు వారాల క్రితం అక్కడికి వెళ్లారు. గ్రీన్ బెల్ట్ మొత్తం తొలగించేసి, ఆ భూమిని షాపింగ్ మాల్ భూమిలో కలిపేసుకొని సిమెంట్ ప్లాట్‌ఫారం నిర్మించిన విషయం గుర్తించారు. వెంటనే అక్కడి నుంచే జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోజు సాయంత్రమే జీవీఎంసీ సిబ్బంది వెళ్లి గ్రీన్ బెల్ట్‌లో కొన్ని నిర్మాణాలను నామమాత్రంగా తొలగించారు. అయితే యాజమాన్యం తమకు అనుమతులు ఉన్నాయంటూ కొన్ని పత్రాలు చూపించింది. దాంతో వారు వెనక్కి తగ్గారు.
ఆశ్చర్యపోయే వాస్తవాలు
- హైవే సర్వీస్ రోడ్డు నుంచి షాపింగ్ మాల్‌లోకి రాకపోకలు సాగించడానికి గ్రీన్ బెల్ట్ మధ్య నుంచి మార్గం వేసుకోవడానికి భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ను యాజమాన్యం అనుమతి కోరింది. వెళ్లడానికి రెండు మార్గాలు, రావడానికి రెండు మార్గాలు కావాలని విజయవాడ అధికారులకు లేఖ రాసింది. ఆగమేఘాలపై అనుమతి ఇచ్చారు. ఒక్కో మార్గం 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవుతో వేసుకోవచ్చునని సూచించారు. దీనికి కేవలం రూ.2 లక్షలు రుసుము కట్టించుకున్నారు. కొన్ని నిబంధనలు విధించారు. గ్రీన్ బెల్ట్ తొలగించడానికి అవసరమైన అనుమతులు అటవీ శాఖ నుంచి తీసుకోవాలని చెప్పారు. రాకపోకలకు ఉపయోగించుకునే భూమి ఎవరిదైతే వారితో యాజమాన్య వివాదాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అంటే ఆ భూమి తమది కాదని పరోక్షంగా సూచించారు. గ్రీన్ బెల్ట్ నిర్వహిస్తున్న జీవీఎంసీదే అని పరోక్షంగా చెప్పారు.
ఎంత భూమి ఇచ్చారంటే...?
ఒక్కో రోడ్డు 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు. ఇలాంటివి నాలుగు రోడ్లు. వెళ్లడానికి రెండు, తిరిగి రావడానికి రెండు. ఈ రహదారుల విస్తీర్ణం 160 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు. అంటే 11,200 చదరపు అడుగులు. ఇది 1,244 చదరపు అడుగులకు సమానం. అక్కడ చదరపు అడుగు భూమి విలువ రూ.1.5 లక్షలు ఉంది. అంటే ఈ భూమి విలువ రూ.18.66 కోట్లు. అంత విలువైన భూమిని ఉపయోగించుకుంటున్నప్పుడు దానికి లీజు మొత్తం జీవీఎంసీకి ఏడాదికి ఓసారి కట్టాలి. ముందుగా అడ్వాన్స్ కొంత చెల్లించాలి. కానీ దీనిపై ఇరువర్గాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు. ఉదారంగా ఇచ్చేశారు.
గ్రీన్‌బెల్ట్ మళ్లీ అభివృద్ధి చేయాలి..కానీ ఎలా..?
ఈ మాల్ వ్యవహారంలో జీవీఎంసీ కూడా గ్రీన్ బెల్ట్ తొలగింపునకు అనుమతి ఇచ్చింది. అయితే ఎన్ని చెట్లు, మొక్కలు తొలగిస్తే వాటికి ఐదు రెట్లు మళ్లీ వేయాలని నిబంధన పెట్టింది. అదే స్థలంలో మళ్లీ గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేయాలని, దానికి రూ.43.3 లక్షలు వ్యయం అవుతుందని పేర్కొంది. అయితే నాలుగు రహదారుల నిర్మాణానికి అవసరమైన మేరకు గ్రీన్ బెల్ట్ తొలగించాలి. కానీ యాజమాన్యం మొత్తం తొలగించేసింది. మళ్లీ అక్కడ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడానికి వీల్లేకుండా సిమెంట్ ప్లాట్‌ఫారం నిర్మించేసింది. అనుమతించిన ఏరియాను మార్గం కోసమే వినియోగించాలని నిర్మాణాలకు, పార్కింగ్‌కు ఉపయోగించకూడదని జీవీఎంసీ నిబంధన పెట్టింది. కానీ అక్కడ పార్కింగ్‌కు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారుల ఏరియాలో నీరు పోవడానికి వీలుగా కాలువ ఉండాలని, దానికి మ్యాన్‌హోళ్లు ఉండాలని చెబితే...జీవీఎంసీకి చెందిన స్థలంలోనే కాలువ నిర్మించడం విశేషం.
ఏమి ముట్టాయో తెలియదు?
ఈ వ్యవహారంలో ఎన్‌హెచ్‌ఏఐ, జీవీఎంసీ అధికారులకు ఏం ముట్టాయో తెలియదు కానీ అడ్డగోలుగా సహకరిస్తున్నారు. గ్రీన్‌బెల్ట్ మధ్య నుంచి రోడ్లు అని చెప్పి మొత్తం మొక్కలు, చెట్లు తీసేశారు. దీనికి ఎవరి నుంచీ అనుమతులు తీసుకోలేదు. కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఉదారంగా వాడుకోవడానికి ఇచ్చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు తప్పితే తప్పులను సవరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఊరుకోబోమంటూ పత్రికా ప్రకటనలు గుప్పించే అధికారులు, నేతలూ నోళ్లు మెదపడం లేదు. ఎందుకో మరి.