Share News

వీడియో కాల్‌ చేసి.. రూ.30 లక్షలు కొట్టేశారు

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:29 AM

‘‘మీరు సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో రోజూ టచ్‌లో ఉంటున్నారు.

వీడియో కాల్‌ చేసి.. రూ.30 లక్షలు కొట్టేశారు

మోసపోయిన రిటైర్డ్‌ ఉద్యోగి

కేసు దర్యాప్తులో వెలుగులోకి వాస్తవాలు

విశాఖ కేంద్రంగా బయటపడిన మ్యూల్‌ గ్యాంగ్‌ ఆగడాలు

- సైబర్‌ నేరగాళ్లకు నకిలీ సిమ్‌కార్డుల విక్రయం

- ఏడుగురు సభ్యులు అరెస్టు

విజయవాడ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి):

‘‘మీరు సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో రోజూ టచ్‌లో ఉంటున్నారు. ముంబైలో ఆయన నేరాలు చేసి సంపాదించిన డబ్బు మీ అకౌంట్‌లో జమ అవుతోంది. మీ పేరు మీద అక్కడ రెండు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయి. మీరు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ ముందు విచారణకు హాజరుకావాలి. ముందు మేం చెప్పిన అకౌంట్‌లో రూ.30 లక్షలు జమ చేయండి. ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదని తేలితే డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.’’

...నగరానికి చెందిన ప్రభుత్వ మాజీ ఉద్యోగికి ఓ వ్యక్తి వీడియోకాల్‌ చేసి చెప్పిన మాటలివి. ఇది నిజమేనని నమ్మిన ఆయన అవతలి వ్యక్తులు చెప్పినట్టు బ్యాంకు అకౌంట్లో డబ్బు డిపాజిట్‌ చేశారు. ఆనక మోసపోయానని గ్రహించి విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు విశాఖపట్నం కేంద్రంగా సిమ్‌ కార్డులు విక్రయించే మ్యూల్‌ గ్యాంగ్‌ బాగోతం బయటపడింది. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఆ వివరాలు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం విజయవాడ సూర్యారావుపేటకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి ముంబై సైబర్‌ క్రైమ్‌ డీసీపీనని చెప్పి ఓ వ్యక్తి వీడియోకాల్‌ చేశాడు. రాజ్‌కుంద్రా చేసిన మోసాల ద్వారా సంపాదించిన డబ్బు రిటైర్డ్‌ ఉద్యోగి అకౌంట్లలో జమ అవుతున్నాయని, ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని హిందీ, ఇంగ్లీష్‌లో చెప్పాడు. వాట్సాప్‌లో ఆయన ఎఫ్‌ఐఆర్‌, అరెస్టు వారెంట్‌ కాపీలను పంపించాడు. ఇవి చూడగానే రిటైర్డ్‌ ఉద్యోగి ఆందోళన చెందారు. ఫోన్‌ చేసిన వ్యక్తి నిజంగా డీసీపీ అని భావించాడు. అతడిని బతిమాలుకోగా, దఫదఫాలుగా తాను చెప్పిన అకౌంట్‌లో రూ.30.37 లక్షలు జమ చేయాలని చెప్పాడు. రాజ్‌కుంద్రాతో ఎలాంటి సంబంధం లేదని తేలితే తిరిగి డబ్బు ఇచ్చేస్తామని చెప్పడంతో రిటైర్డ్‌ ఉద్యోగికి నమ్మకం కలిగింది. డబ్బు ఎంతకీ తిరిగి రాకపోవడం, ముంబై సైబర్‌ క్రైం బ్రాంచ్‌ నుంచి ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో కాల్‌ ఏ నెంబర్‌ నుంచి వచ్చిందో విచారణ చేపట్టారు. సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఎస్‌డీ తేజేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ కోమాకుల శివాజీ, ఎస్‌ఐ మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌ ఏర్పడింది. వీడియో కాల్‌ వచ్చిన నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వీఐ సర్వీసు ప్రొవైడర్‌ నంబర్‌ నుంచి ఈ కాల్‌ వచ్చినట్టు గుర్తించిన పోలీసులు సిమ్‌ కార్డు ఏ చిరునామాతో ఉందో అక్కడికి వెళ్లారు. విశాఖపట్నం చిరునామా చూపించడంతో అక్కడికి వెళ్లి విచారణ చేశారు. ఈ సిమ్‌ను ఎక్కడ కొన్నారో కనుగొన్నారు.

ఒకే వేలిముద్రతో రెండు సిమ్‌ల యాక్టివేషన్‌

కొత్తగా సిమ్‌కార్డు తీసుకునే వారు సంబంధిత సర్వీసు ప్రొవైడర్‌ వద్దకు గానీ, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వద్దకు గానీ వెళ్లి ఆధార్‌ జెరాక్స్‌ చూపించి బయోమెట్రిక్‌ వేయాలి. 24 గంటల తర్వాత సిమ్‌ యాక్టివ్‌ అవుతుంది. ఇలా సిమ్‌ల కోసం వచ్చిన వారి వేలిముద్రతో వారు తీసుకున్న సిమ్‌ను కాకుండా మరో సిమ్‌ను కూడా యాక్టివేట్‌ చేస్తున్నారని గమనించారు. పోలీసుల విచారణలో తాము ఒక సిమ్‌ కార్డు మాత్రమే తీసుకున్నామని కొందరు వివరించారు. సిమ్‌కార్డుల కోసం వచ్చిన వారికి ఒకటి అధికారికంగా ఇచ్చి, మరో మ్యూల్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు గ్యాంగ్‌ వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్‌, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్‌, నంద రూపేష్‌, కాగితాల సింహాద్రి, ఏలూరు జిల్లా నిడమర్రుకు చెందిన పందిరి సత్యనారాయణ, పాత గాజువాక ప్రాంతానికి చెందిన బండి నారాయణమూర్తిని అరెస్టు చేశారు. నిందితుల్లో రాంజీ వీఐ సర్వీసు ప్రొవైడర్‌ షోరూమ్‌లో డిజిటల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. నితిన్‌ మొబైల్‌ సర్వీసింగ్‌ షాపును నిర్వహిస్తున్నాడు. విశాఖపట్నం కేంద్రంగా మ్యూల్‌ సిమ్‌లను యాక్టివేట్‌ చేసి వాటిని సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

ఒక్కో సిమ్‌ ఖరీదు రూ.1,500

మ్యూల్‌ గ్యాంగ్‌ సిమ్‌ కార్డులను సైబర్‌ నేరగాళ్లకు విక్రయించి భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. సర్వీసు ప్రొవైడర్‌ నుంచి సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు సిమ్‌ను రూ.500కు ఇస్తారు. దీనికి ఎగ్జిక్యూటివ్‌ మరో రూ.100 లాభం వేసుకుని రూ.600కు డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయిస్తాడు. సిమ్‌లను యాక్టివేట్‌ చేసే క్రమంలో మ్యూల్‌ సిమ్‌ను సృష్టించిన డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు కలిసి సైబర్‌ నేరగాళ్లకు ఆ సిమ్‌లను విక్రయిస్తున్నారు. ఒక్కో సిమ్‌కార్డును సైబర్‌ నేరగాళ్లకు రూ.1,500 వరకు విక్రయించారు. ఇలా మొత్తం 30 సిమ్‌ కార్డులను సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో 20 సిమ్‌లను సైబర్‌ నేరగాళ్లకు విక్రయించేశారు. ఇలా సృష్టించిన మరికొన్ని మ్యూల్‌ సిమ్‌లను సైబర్‌ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రిటైర్డ్‌ ఉద్యోగి డబ్బు జమ చేసిన ఖాతాల వివరాలను రాబట్టిన పోలీసులు అందులో ఉన్న రూ.1.21 లక్షలను స్తంభింపజేశారు. ఈ ఖాతాను పరిశీలించగా, ఒక్కరోజులోనే రూ.6.2 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేలింది.

Updated Date - Jun 02 , 2024 | 01:29 AM