Share News

దారంతా గోతులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:34 PM

జిల్లాలోని పలు రహదారులు గోతులమయంగా ఉన్నాయి. గతంలో గంట వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకునే వాహనచోదకులు ఇప్పుడు అదే మార్గంలో ప్రయాణించాలంటే రెండు గంటల సమయం పడుతోంది. పాడేరు నుంచి ముంచంగిపుట్టు వెళ్లే రహదారే దీనికి నిదర్శనం.

దారంతా గోతులు
పెదబయలు మండలం బంగారుమెట్ట వద్ద అధ్వానంగా ఉన్న రహదారి

50 కిలోమీటర్ల మార్గంలో 300 పైగా గతుకులు

రాకపోకలకు ఇబ్బందులు

సమయం వృథా, వాహనాలకు మరమ్మతులు

పాడేరు- ముంచంగిపుట్టు మెయిన్‌రోడ్డు దుస్థితి ఇది

కనీస అభివృద్ధికి నోచుకోని వైనం

పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పలు రహదారులు గోతులమయంగా ఉన్నాయి. గతంలో గంట వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకునే వాహనచోదకులు ఇప్పుడు అదే మార్గంలో ప్రయాణించాలంటే రెండు గంటల సమయం పడుతోంది. పాడేరు నుంచి ముంచంగిపుట్టు వెళ్లే రహదారే దీనికి నిదర్శనం. ఈ మార్గంలో 300లకు పైగా గోతులు ఉండడం వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, ఒళ్లు హూనమవుతోందని వాహనచోదకులు వాపోతున్నారు.

ఎక్కడైనా 50 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డులో ఐదో, పదో గోతులు ఉండడం సహజం. కానీ పాడేరు నుంచి ముంచంగిపుట్టు వెళ్లే 50 కిలోమీటర్ల ప్రధాన రహదారిలో 300లకు పైబడి గోతులు ఉండడంతో రాకపోకలకు వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ఏళ్లుగా గోతులు పూడ్చకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు. పాడేరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వున్న ఏజెన్సీ మారుమూల ముంచంగిపుట్టు వెళ్లే మెయిన్‌రోడ్డుకు చాలా ఏళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టలేదు. గత ప్రభుత్వంలో మంజూరైన కొన్ని బిట్‌లతో గతేడాది కొంత మేరకు తారురోడ్డు వేశారు. కానీ మొత్తం రోడ్డులో అధిక భాగం గోతులమయంగా ఉండడంతో పాడేరు- ముంచంగిపుట్టు ప్రయాణమంటే జనం హడలిపోతున్నారు.

మొత్తం రోడ్డంతా గోతులే...

పాడేరు నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రానికి వెళ్లే వరకు మొత్తం గోతులే ఉండడంతో వాహనచోదకులు, ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో పాడేరు మండలం పరిధిలో గబ్బంగి గుత్తులపుట్టు, హుకుంపేట మండలం ఎం.బొడ్డాపుట్టు, మఠం, గంపరాయి, ఈదులపుట్టు, మంగబంద, చుట్టుమెట్ట, అడుగుల పుట్టు, పురుగుడుపుట్టు, బంగారుమెట్ట, వన్నెడ, పెదబయలు, తమరాడ, అడుగులపుట్టు, ముంచంగిపుట్టు మండలంలో చోటాముఖిపుట్టు, కించాయిపుట్టు ప్రాంతాల్లో లెక్కలేనన్ని గోతులు ఉన్నాయి. పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు ప్రయాణానికి గతంలో గంట ఇరవై నిమిషాలు పట్టేది. కానీ ప్రస్తుతం గతుకుల రోడ్డుతో రెండు గంటలు పైడి సమయం పడుతోందని ప్రయాణికులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ మార్గం అభివృద్ధి, మరమ్మతులకు కనీసం చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోని దుస్థితి

పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు వున్న మెయిన్‌రోడ్డు మరమ్మతులపై పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెదబయలుకు చెందిన ఎమ్మెల్యే ఫాల్గుణ తమ సొంత మార్గం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో నియోజకవర్గంలోని ప్రజలు మండిపడుతున్నారు. అలాగే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అత్తవారి ఊరైన ముంచంగిపుట్టు మండలం పెదగూడ వెళ్లే క్రమంలోనూ ఈ మెయిన్‌రోడ్డులోనే ఆమె సైతం ప్రయాణిస్తుంటారు. అయినప్పటికీ మార్గంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. పాడేరు నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు, అటుగా ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించేందుకు ముఖ్యమైన పాడేరు- ముంచంగిపుట్టు మార్గం అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడం ఘోరమని ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు, స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా పాడేరు- ముంచంగిపుట్టు మెయిన్‌రోడ్డును మెరుగుపరచాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:34 PM