సాకారం కాని సీ ప్లేన్
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:44 AM
విశాఖపట్నంలో పర్యాటక శాఖ నిద్దరోతోంది. పర్యాటకులను రప్పించే కొత్త ఆలోచనలు ఏమీ చేయడం లేదు.

విశాఖలో ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదన
మంగమారిపేటలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి నాటి సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం
రెండేళ్ల క్రితం విశాఖపట్నం పోర్టు ప్రతిపాదన
కార్యరూపం దాల్చని ప్రాజెక్టు
పర్యాటక శాఖ నిర్లక్ష్యమే కారణం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో పర్యాటక శాఖ నిద్దరోతోంది. పర్యాటకులను రప్పించే కొత్త ఆలోచనలు ఏమీ చేయడం లేదు. పాత ప్రతిపాదనలను కూడా పట్టించుకోవడం లేదు. గత వారం రోజులుగా ‘సీ ప్లేన్’ గురించి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి సీ ప్లేన్‌ను విజయవంతంగా నడిపారు. సీ ప్లేన్‌లో పది మంది నుంచి 20 మందిని ఒకేసారి తీసుకువెళ్లే సౌలభ్యం ఉంది. దీనిని ఇతర ప్రాంతాల్లో కూడా నడుపుతామని కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.
వాస్తవానికి సీ ప్లేన్ నడపాలనే ప్రతిపాదన విశాఖపట్నంలో ఎనిమిదేళ్ల క్రితమే వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016 జనవరిలో ఇక్కడ జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో దీనిపై చర్చ జరిగింది. చెన్నైకు చెందిన స్కై చాపర్స్ అనే సంస్థ విశాఖపట్నంలో హెలికాప్టర్లతో పాటు సీ ప్లేన్లను కూడా నడుపుతామని ముందుకువచ్చింది. భీమిలి తీరం నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్ నడుపుతామని ప్రకటించింది. ఆ తరువాత జరిగిన చర్చల ఫలితంగా వుడా (వీఎంఆర్‌డీఏ) హెలీ టూరిజం నిర్వహించింది. బసంత్‌కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు వుడా పార్కు నుంచి రుషికొండ వరకు హెలికాప్టర్ నడిపారు. కొద్దిరోజులు నడిపిన తరువాత తూర్పు నౌకాదళం రక్షణ పరమైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిలిపివేశారు. ఆ సమయంలోనే పర్యాటక సంస్థలతో సమావేశం నిర్వహించగా, చంద్రశేఖర్ అనే పారిశ్రామికవేత్త సీ ప్లేన్ నడుపుతామని ఆసక్తి వ్యక్తంచేశారు. తమకు భీమిలి సమీపాన మంగమారిపేటలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మిస్తే సీ ప్లేన్ నడుపుతామన్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మించాలని 2016లోనే చంద్రబాబు ఆదేశించారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు.
రెండేళ్ల క్రితం విశాఖ పోర్టు ప్రతిపాదన
విశాఖపట్నం పోర్టు కూడా సీ ప్లేన్ నడపడానికి రెండేళ్ల క్రితం డీపీఆర్ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకంలో దానిని చేర్చాలని నాడు చైర్మన్‌గా ఉన్న కె.రామమోహన్‌రావు పౌర విమానయాన శాఖకు లేఖ రాశారు. సీ ప్లేన్‌కు అవసరమైన జెట్టీ నిర్మిస్తామని ప్రకటించారు. అప్పటికే పోర్టు క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం సగం పూర్తిచేసింది. ఇప్పుడైతే ఆ టెర్మినల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంది. క్రూయిజ్‌లు ఎలాగూ రావడం లేదు. కనీసం సీ ప్లేన్ అయినా నడిపితే బాగుంటుంది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, హుస్సేన్ సాగర్ (హైదరాబాద్), చిలకా సరస్సు (ఒడిశా), తిరుపతి వంటి ప్రాంతాలకు డిమాండ్ ఉంటుంది.
సీ ప్లేన్ నీటిపైనా, భూమిపైనా ల్యాండ్ అవుతుంది. అలాగే టేకాఫ్ ఎక్కడి నుంచైనా తీసుకోగలుగుతుంది. లోకల్ టూరిజం కింద విశాఖపట్నం నుంచి రుషికొండ, భీమిలి, అరకులోయ, లంబసింగి, పొరుగునే ఉన్న అరసవిల్లికి కూడా నడపొచ్చు. అయితే జిల్లా పర్యాటక శాఖ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇక్కడ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ పోస్టు, ఏపీటీడీసీలో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ బాధ్యతలన్నీ ఒక్కరికే అప్పగించారు. ఆ శాఖను సంస్కరించాలని ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచించడం లేదు.