Share News

సర్వే సర్వత్రా...

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:27 AM

అందరిలోను ఒకటే ఉత్కంఠ. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది?, జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి?, ఎవరు గెలుస్తారు?, ఎవరు ఓడిపోతారు?...ఎక్కడ చూసినా ఇదే చర్చ.

సర్వే సర్వత్రా...

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆసక్తి

సాయంత్రం 6.30 గంటల నుంచి టీవీలకు అతుక్కుపోయిన జనం

లోకల్‌ నుంచి జాతీయ స్థాయి వరకూ 45 సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి

కూటమి విజయం సాధిస్తుందన్న 40 సంస్థలు

వైసీపీ నెగ్గుతుందన్న ఐదు సంస్థలు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 12 స్థానాల వరకూ కూటమి కైవసం చేసుకుంటుందని పలు సంస్థల అంచనా

విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీ సీట్లు కూటమి ఖాతాలోనే...

మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు ఓడిపోబోతున్నారన్న ‘ఆరా’

విశాఖ ‘నార్త్‌’లో టైట్‌ ఫైట్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అందరిలోను ఒకటే ఉత్కంఠ. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది?, జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి?, ఎవరు గెలుస్తారు?, ఎవరు ఓడిపోతారు?...ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ ప్రశ్నలకు నాలుగో తేదీన సమాధానం లభించనున్నది. అయితే ఈలోగా సర్వే సంస్థలు కొంత స్పష్టత ఇచ్చాయి. దేశవ్యాప్తంగా చివరివిడత పోలింగ్‌ శనివారం ముగియడంతో సాయంత్రం 6.30 గంటల తరువాత వరుసగా ఒక దాని తరువాత మరొకటి ఎగ్జిట్‌ పోల్‌ వివరాలు వెల్లడించాయి. దాంతో జిల్లా వాసులు టీవీలకు అతుక్కుపోయి ఆసక్తిగా వీక్షించారు. దాదాపు 45కి పైగా సంస్థలు తాము చేపట్టిన సర్వే ఫలితాలు ప్రకటించాయి. వాటిలో 40 రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తాయని తెలిపాయి. కేవలం ఐదు సంస్థలు మాత్రమే వైసీపీకి ఆధిక్యం లభిస్తుందని వెల్లడించాయి.

కొన్ని నెలల క్రితం పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇలాగే వచ్చాయి. కేసీఆర్‌ సారధ్యం వహిస్తున్న అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు తెలిపాయి. దీనిని బీఆర్‌ఎస్‌ అంగీకరించలేదు. అవన్నీ తప్పుడు సర్వేలని కేటీఆర్‌ కొట్టి పడేశారు. కానీ సర్వే సంస్థలు చెప్పిందే నిజమైంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోను సర్వే సంస్థలు ఏకపక్షంగా కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి 144 సీట్లు వస్తాయని పయనీర్‌ సంస్థ వెల్లడించింది. కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థలు వైసీపీకి 60 సీట్లు వస్తాయని తేల్చాయి. ఇతర పార్టీలకు ఒకటి కంటే ఎక్కువ సీట్లు రావని పేర్కొన్నాయి. కేకే సర్వే సంస్థ అయితే కూటమికి 161 స్థానాలు వస్తాయని, వైసీపీకి కేవలం 14 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. రైజ్‌ సంస్థ కూటమికి 113-122, వైసీపీకి 48-60, చాణక్య స్ర్టాటజీస్‌ కూటమికి 114-125, వైసీపీకి 39-49, పీపుల్స్‌ పల్స్‌ సంస్థ కూటమికి 111-135, వైసీపీకి 45-60, ఆరా సంస్థ కూటమికి 71-81, వైసీపీకి 94-104 వస్తాయని ప్రకటించాయి. అలాగే చాణక్య సంస్థ వైసీపీకి 110-120, కూటమికి 55-65, జన్‌మత్‌ పోల్స్‌ వైసీపీకి 95-103, కూటమికి 65-75 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.

పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే...కూటమికి 21-23, వైసీపీకి 2-4 సీట్లు వస్తాయని ఇండియా టుడే వెల్లడించింది. అలాగే ఎన్‌డీటీవీ...కూటమికి 18, వైసీపీకి 7, రిపబ్లిక్‌ టీవీ...కూటమికి 14, వైసీపీకి 11, న్యూస్‌ 18 ...కూటమికి 19-22, వైసీపీకి 5-8, ఏబీబీ, సీ ఓటర్‌...కూటమికి 21-22, వైసీపీకి 0-4 సీట్లు వస్తాయని, ఇండియా టీవీ... కూటమికి 21 సీట్లు వస్తాయని ప్రకటించాయి.

విశాఖ జిల్లా చూసుకుంటే...

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 స్థానాలు కూటమికి, 3 వైసీపీకి వస్తాయని పలు సంస్థలు వెల్లడించింది. అరకులోయ, పాడేరు, మాడుగుల స్థానాలు మాత్రమే వైసీపీకి వస్తాయని, మిగిలినవన్నీ కూటమేకే దక్కుతాయని విశ్లేషించాయి. జనసేన పోటీ చేసిన నాలుగు (అనకాపల్లి, ఎలమంచిలి, విశాఖపట్నం దక్షిణం, పెందుర్తి) సీట్లు గెలుచుకుంటుందని, విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు గెలుస్తారని తెలిపాలి

‘ఆరా’ మస్తాన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడిస్తూ రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేసిన చోట ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. ఆయన లెక్కల ప్రకారం విశాఖ జిల్లాలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ (గాజువాక) ఓడిపోతున్నారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఓడిపోతారని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ గెలుస్తారని వెల్లడించారు. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, వైసీపీ అభ్యర్థి కేకే రాజు నుంచి టైట్‌ ఫైట్‌ ఎదుర్కొన్నారని విశ్లేషించారు. విశాఖపట్నం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ గెలుపు ఖాయమని, ఆయనకు మెజారిటీ కూడా భారీగా వస్తుందని పలు సంస్థలు విశ్లేషించాయి.

Updated Date - Jun 02 , 2024 | 01:27 AM