Share News

ఎండ ప్రచండం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:20 AM

ఊహించని విధంగా మన్యంలో భానుడు భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పాడేరు, కొయ్యూరు, డుంబ్రిగుడ, జి.మాడుగులలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత దాటింది. పాడేరులో ఓ గిరిజన యువకుడి బైక్‌ తీవ్రమైన ఎండ ధాటికి దగ్ధమైంది. ఇప్పటి వరకు ఒక మోస్తరుగా ఉండే ఎండలు ఉదయం నుంచే ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి రోడ్లపై జనం సంచరించేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. ఎండల తీవ్రతకు మన్యం వాసులు విలవిల్లాడుతున్నారు.

ఎండ ప్రచండం
కుమ్మరిపుట్టు సమీపంలో అడుగంటిన మత్స్యగెడ్డ

- పాడేరు, కొయ్యూరు, డుంబ్రిగుడ, జి.మాడుగులలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

- ఎండ తీవ్రతకు పాడేరులో బైక్‌ దగ్ధం

పాడేరు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఊహించని విధంగా మన్యంలో భానుడు భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పాడేరు, కొయ్యూరు, డుంబ్రిగుడ, జి.మాడుగులలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత దాటింది. పాడేరులో ఓ గిరిజన యువకుడి బైక్‌ తీవ్రమైన ఎండ ధాటికి దగ్ధమైంది. ఇప్పటి వరకు ఒక మోస్తరుగా ఉండే ఎండలు ఉదయం నుంచే ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి రోడ్లపై జనం సంచరించేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. ఎండల తీవ్రతకు మన్యం వాసులు విలవిల్లాడుతున్నారు.

కొయ్యూరులో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

మన్యంలో శుక్రవారం కొయ్యూరులో 40.7 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 37.1 అరకులోయలో 39.9, చింతపల్లిలో 39.2, డుంబ్రిగుడలో 40.0, జీకేవీధిలో 40.0, జి.మాడుగులలో 39.1, హుకుంపేటలో 38.4, ముంచంగిపుట్టులో 39.3, పాడేరులో 40.0, పెదబయలులో 37.3 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ద్విచక్ర వాహనం దగ్ధం

పాడేరు రూరల్‌: ఎండ తీవ్రతకు పాడేరులో శుక్రవారం కిల్లో హరి అనే యువకుడికి చెందిన ద్విచక్ర వాహనం దగ్ధమైంది. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ చేదుపుట్టు గ్రామానికి చెందిన హరి తన బైక్‌పై శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాడేరు పీటీడీ కాంప్లెక్స్‌ రోడ్డులోని సినిమాహాలు సెంటర్‌కు వస్తుండగా బైక్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనాన్ని విడిచి పెట్టి ఆ యువకుడు బయటపడ్డాడు. చుట్టుపక్కల వారు ఆ మంటలను అదుపు చేశారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండలంలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ముంచంగిపుట్టులో శుక్రవారం 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మండలంలోని సుజనకోట, పెదగూడ, జోలాపుట్టు, పనసపుట్టు, లక్ష్మీపురం, బూసిపుట్టు, దారెల తదితర పంచాయతీల పరిధిలో ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ పాయలు అడుగంటిపోతున్నాయి. సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డ పూర్తి స్థాయిలో అడుగంటిపోయింది. దీంతో పలు గ్రామాల ప్రజలు నడుచుకుంటూ గెడ్డ దాటి రాకపోకలు సాగిస్తున్నారు. మత్స్యగెడ్డలో నీరు లేకపోవడం వల్ల జోలాపుట్టు, డుడుమ జలాశయాలకు ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. ప్రస్తుతం ఆయా జలాశయాల్లో సైతం నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు.

Updated Date - Apr 20 , 2024 | 01:20 AM