Share News

‘ఉపాధి’కి నీడ కరవు

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:54 PM

నీడ లేక మండుటెండలో ఉపాధి కూలీలు ఆపసోపాలు పడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇక ఉపాధి కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై యంత్రాంగం దృష్టి సారించకపోవడతో నీడ నిచ్చే టెంట్లు, తాగునీరు, ఇతర వసతులకు దూరంగా మండుటెండలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందని కూలీలు వాపోతున్నారు.

‘ఉపాధి’కి నీడ కరవు
దాసరియ్యపాలెం కన్నుల చెరువులో పూడిక తీత పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

మండుటెండలో పనిచేస్తున్న కూలీలు

అందుబాటులో లేని తాగునీరు

పని ప్రదేశాల్లో కనిపించని టెంట్లు

వడదెబ్బకు గురయ్యే అవకాశాలు

సౌకర్యాల కల్పనపై దృష్టి సారించని అధికారులు

రావికమతం, ఏప్రిల్‌ 13:

నీడ లేక మండుటెండలో ఉపాధి కూలీలు ఆపసోపాలు పడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇక ఉపాధి కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై యంత్రాంగం దృష్టి సారించకపోవడతో నీడ నిచ్చే టెంట్లు, తాగునీరు, ఇతర వసతులకు దూరంగా మండుటెండలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందని కూలీలు వాపోతున్నారు.

రావికమతం మండలంలో 320 గ్రూపులకు చెందిన 8,370 మంది ఉపాధికూలీలు చెరువులు, పంట కాలువల్లో పూడిక తీత, మట్టిరోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. వీరిలో ఎవరైనా ఎండతీవ్రతతో అలసటకు గురై నీరసిస్తే పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలైన టెంట్‌, ప్రథమ చికిత్స కిట్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. అయితే ఆయా ప్రదేశాల్లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. కూలీలే ఇంటి నుంచి సీసాల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. గతంలో నీటిని అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఒకరిద్దరిని ఏర్పాటు చేసేవారు. కాగా కొన్ని పని ప్రదేశాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు ఉండగా, మరి కొన్ని చోట్ల కనిపించడంలేఏదు. దీంతో పాటు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూమిలో ఏమాత్రం పదును లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలో నేల గట్టిపడి పనులు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలపైనా అనుమానమే...

పదును లేక పనులు సాఫీగా సాగకపోవడంతో వేతనాలు కూడా తక్కువగా వచ్చే అవకాశముందని కూలీలు వాపోతున్నారు. మండుటెండలో పనులు సాగిస్తున్నా గిట్టుబాటు కూలీ దక్కదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. గతంలో మాదిరిగా చేసిన పనికి ప్లేసిప్లు ఇవ్వాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఉపాధిహామీ పథకం ఏపీవో కాశీని వివరణ కోరగా పని ప్రదేశాల్లో నీడ కల్పించేందుకు టార్పాలిన్లు లేకపోవడం వాస్తవమేనన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నామన్నారు. తాగునీటి వసతి కూడా కల్పిస్తామన్నారు. ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఎండలు పెరిగిపోవడంతో పనులు త్వరగా ముగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మార్చి వరకూ మండలానికి రూ1.2 కోట్ల మేర ఉపాధి వేతనాలు కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు.

నీడలేక ఇబ్బందులు

ఆరు వారాలుగా కన్నుల చెరువులో పూడిక తీత పనులు చేస్తున్నాం. భూమిలో తేమ లేక మట్టిలో పలుగు దిగడం లేదు. పూడిక తీత పనులు కష్టంగా ఉన్నాయి. తొమ్మిది గంటలు దాటితే ఎండ ఎక్కువై పనిచేయలేకపోతున్నాం. పని చేసే ప్రాంతంలో నీడలేక సొమ్మసిల్లుతున్నాం. గతంలో టెంట్‌లు ఉండేవి. ఇప్పుడు లేవు. రోజు కూలీ కూడా ఎంత వస్తుందో తెలియడం లేదు.

- జనపు రెడ్డి అప్పారావు, ఉపాధి కూలీ, దాసరయ్యపాలెం.

పూడక తీత పనులు చేస్తున్నాం. నాలుగు వారాల కూలి డబ్బులు బ్యాంకులో పడ్డాయంటున్నారు. బ్యాంకుకు వెళ్తే ఇంకా రాలేదంటున్నారు. పని ప్రదేశంలో టార్పాలిన్లు లేకపోవడంతో ఎండను తట్టుకోలేకపోతున్నాం. సేదదీరే మార్గం లేకుండా పోయింది. తాగునీరు కూడా లేకపోవడంతో ఇంటి నుంచి సీసాలతో నీరు తెచ్చుకుంటున్నాం.

- మేడిబోయిన కుమారి, ఉపాధి కూలీ, గుడివాడ.

Updated Date - Apr 13 , 2024 | 11:54 PM