వీడిన రాజకోట రహస్యం
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:59 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మోజుపడి, నిబంధనలను తోసి రాజని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ గుట్టు వీడింది.

రుషికొండపై ఇంద్ర భవనాన్ని మీడియాకు చూపించిన ఎమ్మెల్యే గంటా
కళ్లు చెదిరే నిర్మాణాలతో అవాక్కైన జనం
పేదోడి ఇంటి కంటే రెండింతలు పెద్దవిగా బాత్రూమ్‌లు
జగన్ కోసం ఆధునికత ఉట్టిపడేలా సామగ్రి
ఫ్యాన్ నుంచి బాత్రూమ్ కమోడ్ వరకు ఖరీదైనవే
ఏడు బ్లాకుల్లో సాగిన నిర్మాణాలు
ఒక్కో బ్లాక్‌కు రూ.కోట్లలో వ్యయం
అడ్డగోలు భవనంలో ఎన్నెన్నో విచిత్రాలు
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మోజుపడి, నిబంధనలను తోసి రాజని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ గుట్టు వీడింది. రాజమహల్‌ను తలదన్నే రీతిలో అత్యాధునిక హంగులు, ఆర్భాటాలతో ఏడు బ్లాకుల్లో నిబంధనలకు విరుద్ధంగా, కోర్టులను బురిడీ కొట్టించి మరీ సాగించిన నిర్మాణాలను భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు.
కూటమిలోని మూడు పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని మరీ ప్యాలెస్‌కు వెళ్లిన గంటా.. ఏడు బ్లాకుల్లో నిర్మితమైన భవనాల్లోని అనువణువును బయట ప్రపంచానికి బహిర్గతం చేశారు. తానో నిరుపేదను అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత విలాసవంతంగా ప్రజాధనంతో నిర్మించిన రాజమహల్‌లోని బాత్రూమ్ కూడా సాధారణ ప్రజలు నివసించే ఇంటికి రెండింతలు ఉండడం గమనార్హం.
మూడేళ్లుగా నిర్మాణం
గడిచిన మూడేళ్లుగా సాగుతున్న ఈ భవన నిర్మాణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ నిర్మాణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. ఒక్కోసారి ఒక్కో రీతిన ప్రకటనలు జారీచేసినా.. వాటిలో ఏది నిజమో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కొద్దిరోజులు ముందు అప్పటి పర్యాటకశాఖా మంత్రి రోజా హడావిడిగా ఈ భవనాలను ప్రారంభించి వెళ్లిపోయారు. అయితే, దీనిని దేనికి వినియోగిస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు.
అంతర్జాతీయస్థాయిలో...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రుషికొండపై నిర్మించిన రాజమహల్ గుట్టును గంటా బయటపెట్టారు. రూ.500 కోట్ల వ్యయంతో ఏడు బ్లాకుల్లో రుషికొండపై అత్యంత విలాసవంతంగా జగన్ నిర్మించుకున్న భవనాన్ని ఆసాంతం పరిశీలించారు. ఇందులోని ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనదే. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు, హాల్ నుంచి కిచెన్ వరకు.. ప్రతిచోటా వినియోగించిన సామగ్రి, ఫర్నిచర్ కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయి. ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో బాత్రూమ్ ఫిటింగ్స్, ఒళ్లు పట్టించుకోవడానికి మసాజ్ (స్పా) రూములు, భారీ సైజు పడక గదులు, విశాలమైన కారిడార్లు.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంద్ర భవనాన్ని తలపించేలా రీతిలో వసతులను ఏర్పాటు చేయించారు. వందలాది మందితో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాళ్లు, ఫైళ్లు భద్రపరిచేందుకు లాకర్లు ఏర్పాటు చేశారు. ఏడు బ్లాకుల్లో నిర్మాణాలు చేపట్టగా, వీటన్నింటినీ సొంతానికి వినియోగించుకునేలా డిజైన్ చేయడం గమనార్హం. ఆయా బ్లాకులకు పెట్టిన పేర్లు కూడా రాచరిక వ్యవస్థను గుర్తుచేసేలా ఉండడం మరో విశేషం. భవన నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిచేశారు. ఈ దృశ్యాలను టీవీలు, సోషల్ మీడియాలో చూసిన ప్రజలు అవాక్కయ్యారు. ప్రజల డబ్బుతో జగన్ తన స్వార్థం కోసం ఇంతటి భవనం నిర్మించుకున్నారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.