Share News

అదే నిర్లక్ష్యం!

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:44 AM

జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలు, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత యాజమాన్యాలకు అధికారులు మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి, తాత్కాలికంగా ఉత్పత్తులు నిలిపివేయిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం మళ్లీ అనుమతులు జారీ చేస్తున్నారు.

అదే నిర్లక్ష్యం!
ఠాగూర్‌ ఫార్మాలో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా

ఫార్మా కంపెనీల్లో ఆగని ప్రమాదాలు

కార్మికుల ప్రాణాలతో చెలగాటం

విచారణ కమిటీల నివేదికలు బుట్టదాఖలు

తాజాగా ‘పరవాడ’లోని ఠాగూర్‌ ఫార్మాలో విషవాయువు లీక్‌

ఒకరి మృతి, తొమ్మిది మందికి అస్వస్థత

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలు, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత యాజమాన్యాలకు అధికారులు మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి, తాత్కాలికంగా ఉత్పత్తులు నిలిపివేయిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం మళ్లీ అనుమతులు జారీ చేస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. ఫార్మా రంగ చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రమాదం. ఈ సంఘటన మరువకముందే గత రెండు నెలల్లో పరవాడ ఫార్మాసిటీలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో మెట్రో కంపెనీలో రియాక్టర్‌ పేలి పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణాలకు ముప్పు వాటిల్లలేదు. తరువాత సినర్జీస్‌ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. తాజాగా ఠాగూర్‌ లేబొరేటరీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్‌ కమ్‌ రిసీవర్‌ ట్యాంకు నుంచి 400 లీటర్ల ప్రమాదకర లిక్విడ్‌ లీకవడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన అమిత్‌ భాగ్‌ (23) అనే కార్మికుడు మృతిచెందగా తొమ్మిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాకలో రెండు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.

వరుస ప్రమాదాలతో కార్మికుల్లో ఆందోళన

అనకాపల్లి జిల్లాలో 118 ఫార్మా కంపెనీల్లో 20 వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గత ఆరేళ్ల కాలంలో ఫార్మా కంపెనీల్లో 54 ప్రమాదాలు జరిగాయి. ఈ సంఘటనల్లో 62 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 92 మంది క్షతగాత్రులయ్యారు. అయితే వెలుగులోకి రాని ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. ఇదిలావుండగా 2016 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో కంపెనీల్లో కంప్యూటర్‌ ఆధారిత తనిఖీలు అమలులోకి తేవడంతో స్థానిక అధికారుల భౌతిక తనిఖీలు నిలిచిపోయాయి. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, కార్మిక, అగ్నిమాపక, బాయిలర్‌ చెకింగ్‌ వ్యవస్థలు తనిఖీలపై అశ్రద్ధ చేస్తున్నాయి. అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీపై భూములు, నీరు, కరెంట్‌ వంటి మౌలిక సదుపాయాలు పొందుతున్న యాజమాన్యాలు... వీటిల్లో పనిచేస్తున్న కార్మికుల భదత్రత, రక్షణకు సరైన చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

వెల్లడి కాని విచారణ నివేదికలు

చిన్న చిన్న మానవ తప్పిదాల వల్ల ఫార్మా కంపెనీల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతి సందర్భంలోనూ విచారణ కమిటీలను నియమిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి అందిస్తున్న నివేదికలను మాత్రమే బయటకు వెల్లడించడం లేదు. ఆగస్టులో అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన భారీ ప్రమాదంపై వసుధామిశ్రా చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీని విచారణకు నియమించింది. ఆ కమిటీ విచారణ నివేదిక ఇంతవరకు బహిర్గతం కాలేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఫార్మా కంపెనీల్లో జరిగిన ప్రమాదాలపై నియమించిన విచారణ కమిటీల నివేదికలు సైతం బయటకు రాలేదు. విచారణ కమిటీల నివేదికలను బహిర్గతం చేయకపోవడం, కంపెనీల్లో ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదలు జరగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఠాగూర్‌ ఫార్మా కార్మికులకు చికిత్స

బాధితులకు కలెక్టర్‌, ఎస్పీ పరామర్శ

గాజువాక, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పరవాడ మండలంలోని ఫార్మా సిటీలో వున్న ఠాగూర్‌ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైన సంఘటనలో అస్వస్థతకు గురైన కార్మికుల్లో ఆరుగురిని వడ్లపూడిలోని పవన్‌సాయి ఆస్పత్రికి తరలించారు. వీరిలో అగనంపూడికి చెందిన జి.శరత్‌కుమార్‌ (40), అనకాపల్లికి చెందిన ఎ.అనీల్‌ (24), అప్పికొండకు చెందిన సీహెచ్‌.రాజారావు (36), వడ్లపూడికి చెందిన ఎన్‌.భాస్కర్‌ (23), నాతయ్యపాలేనికి చెందిన బి.వీరబాబు (30), విజయనగరం జిల్లా గుర్లకి చెందిన డి.పాపారావు (33) వున్నారు. వీరిని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, డీఎంహెచ్‌వో, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో ఇద్దరు..

అక్కిరెడ్డిపాలెం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఠాగూర్‌ లేబొరేటరీస్‌లో విషవాయువు లీక్‌ కావడంతో అస్వస్థతకు గురై షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా పరామర్శించారు. తొలుత ఇక్కడకు ముగ్గురు కార్మికులను తీసుకురాగా వీరిలో అమిత్‌భాగ్‌(23) బుధవారం మధ్యాహ్నం మృతిచెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా విజయకృష్ణన్‌ విలేకరులతో మాట్లాడుతూ, మృతిచెందిన అమిత్‌భాగ్‌ కుటుంబానికి నష్టపరిహారం విషయమై ఫార్మా కంపెనీ యాజమాన్యంతో చర్చిస్తున్నామన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:44 AM