Share News

ఠారెత్తిస్తున్న ఎండలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:09 AM

ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రత 38.0 డిగ్రీలు కాగా అత్యల్ప ఉష్ణోగ్రత 25.0 డిగ్రీలుగా నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

ఠారెత్తిస్తున్న ఎండలు
జనసందడి లేని అనకాపల్లి మెయిన్‌రోడ్డు

అనకాపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 5: ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రత 38.0 డిగ్రీలు కాగా అత్యల్ప ఉష్ణోగ్రత 25.0 డిగ్రీలుగా నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం పదిన్నర గంటల నుంచే వడగాడ్పులు ప్రారంభం కావడంతో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఈ వేసవి ఆరంభంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. గత నాలుగు రోజుల నుంచి 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా శుక్రవారం 38 డిగ్రీలకు పెరగడంతో పాటు వడగాడ్పులు కూడా వీయడంతో నిత్యం జనాలతో రద్దీగా ఉండే పలు ప్రధాన రహదారులు బోసిపోయాయి. మహిళలు, వృద్ధులు తలపై చీర చెంగులు, తువ్వాళ్లను వేసుకుని రాకపోకలు సాగించారు. ద్విచక్ర వాహనచోదకులు వాహనాలు నడపడానికి కూడా ఇబ్బంది పడ్డారు. మెయిన్‌రోడ్డు, చోడవరం రోడ్డు, శారదానది రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డుతో పాటు చిన్నపాటి వీధులు కూడా మధ్యాహ్నం వేళ ఖాళీగా దర్శనమిచ్చాయి. వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు కారణంగా జనం శీతలపానీయాల దుకాణాలను ఆశ్రయుస్తున్నారు. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు.

Updated Date - Apr 06 , 2024 | 12:09 AM