ఎటూ తేలని బార్క్ నిర్వాసితుల సమస్య
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:43 AM
బార్క్ నిర్వాసితుల సమస్య ఎటూ తేలలేదు. ముందుగా సర్వే చేయడానికి సహకరించాలని, తరువాత ధర నిర్ణయిస్తామని రైతులను తహసీల్దార్ జీవీ జనార్దన్ కోరగా, ముందుగా భూమి ధర నిర్ణయించాలని, ఆ తరువాతే సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ముందుగా సర్వే చేసిన తరువాత ధర నిర్ణయిస్తామన్న తహసీల్దార్
ధర నిర్ణయించిన తరువాతే సర్వే చేయాలని రైతుల డిమాండ్
అచ్యుతాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): బార్క్ నిర్వాసితుల సమస్య ఎటూ తేలలేదు. ముందుగా సర్వే చేయడానికి సహకరించాలని, తరువాత ధర నిర్ణయిస్తామని రైతులను తహసీల్దార్ జీవీ జనార్దన్ కోరగా, ముందుగా భూమి ధర నిర్ణయించాలని, ఆ తరువాతే సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయం కలెక్టర్‌కు తెలియజేస్తానని తహసీల్దార్ వెళ్లిపోయారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) నిర్వాసితులతో శనివారం దొప్పెర్ల దుర్గ ఆలయంలో తహసీల్దార్ జీవీ జనార్దన్, డీటీ శ్యామ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బార్క్ ఉద్యోగుల నివాస కాలనీకి దొప్పెర్ల పంచాయతీ వివిధ సర్వే నంబర్ల నుంచి 91.22 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించి 2010 ఆగస్టులోనే ఏపీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి భూమికి ధరను నిర్ణయించలేదు. ఈ భూమిలో జిరాయితీతో పాటు ప్రభుత్వానికి చెందిన పట్టా భూములు కూడా ఉన్నాయి. ఏళ్ల తరబడి సాగుచేస్తున్నాం కాబట్టి పట్టా భూములకు కూడా పరిహారం ఇవ్వాలని రైతులు పట్టు బట్టారు. ప్రభుత్వ భూమికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం భీష్మించుకోవడంతో ఏళ్ల తరబడి సమస్య అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిని సరిచేయాలని నిర్ణయించింది. దీంతో ఆర్డీవో షేక్ ఆయీషా ఈ నెల 24న తహసీల్దార్ కార్యాలయంలో భూనిర్వాసిత నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు ఆమోదిస్తే తప్ప భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పేశారు. అంతేకాక గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ శనివారం దొప్పెర్ల దుర్గ గుడిలో నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. పట్టా భూములు పక్కా జిరాయితీగా మార్పు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసింది. అందువల్ల తమ పట్టా భూములకు కూడా జిరాయితీతో సమానంగా పరిహారం ఇవ్వాలని, ముందుగా ధర నిర్ణయించిన తరువాతే సర్వే చేయాలని రైతులు పట్టుబట్టారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పి తహసీల్దార్, డీటీ వెనుతిరిగారు. ఈ సమావేశంలో పల్లి శేషగిరిరావు, కొల్లి వరహాల రావు, కొల్లి చిన్నారావు, పల్లి వెంకటరావు, కొల్లి సన్నిబాబు, పల్లి సత్యారావు తదితరులు పాల్గొన్నారు.