Share News

విద్యుదుత్పత్తి లక్ష్యం 2,286.14 మిలియన్‌ యూనిట్లు

ABN , Publish Date - May 26 , 2024 | 12:55 AM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలకు 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి విద్యుదుత్పత్తి లక్ష్యం 2,286.14 మిలియన్‌ యూనిట్లుగా సెంట్రల్‌ విద్యుత్‌ అఽథారిటీ నిర్దేశించినట్టు స్థానిక ఏపీ జెన్‌కో అధికారులు శనివారం తెలిపారు.

విద్యుదుత్పత్తి లక్ష్యం 2,286.14 మిలియన్‌ యూనిట్లు
పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రం

- సీలేరు కాంప్లెక్సు పరిధిలోని నాలుగు జల విద్యుత్‌ కేంద్రాలకు నిర్దేశం

- నూతన ఆర్థిక సంవత్సరానికి టార్గెట్‌ విధించిన కేంద్ర విద్యుత్‌ అథారిటీ

సీలేరు, మే 25: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలకు 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి విద్యుదుత్పత్తి లక్ష్యం 2,286.14 మిలియన్‌ యూనిట్లుగా సెంట్రల్‌ విద్యుత్‌ అఽథారిటీ నిర్దేశించినట్టు స్థానిక ఏపీ జెన్‌కో అధికారులు శనివారం తెలిపారు. ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్‌ కేంద్రాలకు సమకూరే నీటి వనరులు, జల విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం ఆధారంగా కేంద్ర విద్యుత్‌ అథారిటీ అధికారులు విద్యుదుత్పత్తి లక్ష్యాలను నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలోనే సీలేరు కాంప్లెక్సు పరిధిలో నాలుగు జల విద్యుత్‌ కేంద్రాలు ఉండగా పొల్లూరు (లోయర్‌ సీలేరు) జల విద్యుత్‌ కేంద్రానికి 1,084 మిలియన్‌ యూనిట్లు, డొంకరాయి మినీ జల విద్యుత్‌ కేంద్రానికి 95.14, సీలేరు (ఎగువ సీలేరు) జల విద్యుత్‌ కేంద్రానికి 477, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి 630 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంగా నిర్దేశిస్తూ ఏపీ జెన్‌కో కేంద్ర కార్యాలయం విజయవాడ (గుణదల) విద్యుత్‌ సౌధాకు పంపించడంతో జెన్‌కో ఉన్నతాధికారులు ఈ టార్గెట్‌ వివరాలను సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జెన్‌కో కార్యాలయానికి పంపించినట్టు జెన్‌కో వర్గాల సమాచారం. గత ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 2,279.4 మిలియన్‌ యూనిట్లుగా నిర్దేశించారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బలిమెల పరీవాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో కాంప్లెక్సు పరిధిలో ఒక్క మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం మాత్రమే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగా, పొల్లూరు, డొంకరాయి, సీలేరు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు సీలేరు కాంప్లెక్సులోని నాలుగు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మించి జరుగుతుందని స్థానిక జెన్‌కో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 12:55 AM