Share News

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:01 AM

ఇది చాలా కీలకమైన సమయమని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని పార్టీ నాయకులకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు.

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయం

దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ముఖ్యం

ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి

ఈసారి అధికారంలోకి రావాలనే కూటమిగా వెళుతున్నాం

కొన్ని త్యాగాలు తప్పవు

ఎవరికైనా పోటీ చేసే అవకాశం రాకపోతే భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తాం

ఏదైనా ఉంటే నాతోనో, రాజకీయ వ్యవహారాల కమిటీతోనే చర్చించండి

పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌

పర్యటన ముగించుకొని రాజమండ్రికి పయనం

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):

ఇది చాలా కీలకమైన సమయమని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని పార్టీ నాయకులకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు. ఆదివారం రాత్రి విశాఖపట్నం వచ్చిన ఆయన సోమవారం ఉదయం నోవాటెల్‌ హోటల్‌లో పార్టీ నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో విడివిడిగా మాట్లాడారు. ఈసారి అధికారంలోకి రావాలనే ధ్యేయంతో కూటమిగా కలిసి వెళుతున్నామని, ఈ నేపథ్యంలో కొన్ని త్యాగాలు తప్పవని సూచనప్రాయంగా చెప్పారు. ఎక్కడైనా ఎవరికైనా పోటీ చేసే అవకాశం రాకపోతే...భవిష్యత్తులో వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసంతృప్తితోనో, వేరే విధంగానో పార్టీ గురించి ఎక్కడా బయట మాట్లాడవద్దని సూచించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదని స్పష్టంచేశారు. ఎవరికైనా అనుమానాలు, అసంతృప్తి ఉంటే వాటిని బయట మాట్లాడవద్దని, నేరుగా తన దృష్టికే తీసుకురావాలన్నారు. తాను అందుబాటులో లేనిపక్షంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఉందని, వారితో చర్చించాలని సూచించారు. అంతే తప్ప పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించవద్దని కోరారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశం ముగిసిన తరువాత విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ పలువురిని జనసేన పార్టీలో చేర్పించారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వెళ్లిపోయారు.

పేర్లు ఖరారయ్యారంటూ ఊహాగానాలు

పార్టీ అధినేతతో పలువురు సమావేశమైన సందర్భంగా కొందరికి స్పష్టమైన భరోసా లభించిందని, వారికి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారంటూ సోషల్‌ మీడియాలో కొందరి పేర్లు షికారు చేశాయి. విశాఖ జిల్లాలో ఇద్దరికి, అనకాపల్లి జిల్లాలో ఇద్దరికి ఫలానా స్థానాలు అంటూ ప్రచారం చేశారు. అయితే ఎవరి పేర్లు ఖరారు చేయలేదని, ఆ ఊహాగానాలు నమ్మవద్దని పార్టీ నాయకులు పలువురు స్పష్టంచేశారు.

Updated Date - Feb 20 , 2024 | 02:01 AM