Share News

చందనోత్సవం టికెట్ల మాయాజాలం

ABN , Publish Date - May 08 , 2024 | 01:47 AM

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం టికెట్లు అయినా దొరుకుతాయేమో గానీ సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం టికెట్లు మాత్రం దొరకడం లేదు.

చందనోత్సవం టికెట్ల మాయాజాలం

కలెక్టర్‌ సిఫారసు చేస్తేనే రూ.1,500 టికెట్లు

లేఖలు ఇచ్చిన వారికి ఇప్పటికీ అందని సమాచారం

నేటితో టికెట్ల విక్రయం ముగింపు

ఎవరి కోసం రిజర్వులో వేల టికెట్లు?

మారని అధికారుల తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం టికెట్లు అయినా దొరుకుతాయేమో గానీ సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం టికెట్లు మాత్రం దొరకడం లేదు. చందనోత్సవం రోజున రూ.1,500 టికెట్‌తో దేవుడిని చూడాలంటే జిల్లా కలెక్టర్‌ సిఫారసు తప్పనిసరి. ఆయన ఓకే చేసిన వారికే టికెట్లు ఇస్తున్నారు. మిగిలిన వారికి ఆ టికెట్లు అందడం లేదు. కలెక్టర్‌ కరుణిస్తేనే దైవదర్శనం. లేదంటే...అంతే. గత రెండేళ్లుగా విశాఖపట్నంలో ఇదే జరుగుతోంది. దేవదాయ శాఖపై కలెక్టర్‌ పెత్తనం ఏమిటి? అంటూ ఇప్పటికే ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, నిర్ణయాలు దేవస్థానమే తీసుకోవాలని సూచించారు. కానీ అది అమలు కావడం లేదు. దేవస్థానంపై ఇప్పటికీ కలెక్టర్‌ పెత్తనమే నడుస్తోంది. ఈ నెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ప్రొటోకాల్‌ దర్శనాలన్నీ తెల్లవారుజామున గంటన్నరలోపే పూర్తి చేస్తామని ప్రకటించారు. అంతరాలయ దర్శనాలు ఎవరికీ లేవని కూడా వెల్లడించారు. మిగిలిన భక్తులు దర్శనాల కోసం రూ.300, రూ.1,000, రూ.1,500 విలువైన టికెట్లు ముద్రించారు. ఇవికాకుండా ఉచిత దర్శనాలు ఉంటాయి. ఈ టికెట్లను బ్యాంకుల్లో విక్రయిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన ప్రారంభించి, 8వ తేదీతో ముగిస్తామని ప్రకటించారు. వీటిలో రూ.1,500 విలువైన టికెట్లు రోజుకు 300 చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు 1,200 టికెట్లు మాత్రమే అమ్మారు. కానీ 4,500 ముద్రించారు. చివరిరోజైన బుధవారం మరో 300 టికెట్లు ఆన్‌లైన్‌లో ఇస్తారు. అంటే ఆన్‌లైన్‌లో 1,500 టికెట్లు అమ్మి మిగిలిన మూడు వేల టికెట్లు రిజర్వ్‌లో ఉంచారు. ఎవరైనా ఈ టికెట్లు కావాలనుకుంటే లేఖలు సమర్పించాలని, ఒక లేఖపై నాలుగు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. దీంతో చాలామంది నగర ప్రముఖులు, దాతలు, వ్యాపారులు, అధికారులు ఈఓ కార్యాలయంలో లేఖలు సమర్పించారు. కానీ అత్యధికులకు ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం లేదు. ఆ లేఖలను కలెక్టర్‌కు పంపుతామని, వాటిలో ఎన్నింటికి ఆమోదం లభిస్తే...వారికే టికెట్లు ఇస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ టికెట్ల విక్రయంలో కలెక్టర్‌ పాత్ర ఏమిటి? ఎందుకు? అనేది వెల్లడించడం లేదు. గత ఏడాదీ ఇలాగే చేశారు. స్వామి వారికి నిత్యం పూజలు, దానాలు చేసే వారికి కూడా టికెట్లు ఇవ్వడం లేదు. వారికి నచ్చిన వారికి ఈ టికెట్లు అమ్ముకుంటున్నారు. గత ఏడాది కూడా ఈ విషయం నిరూపితమైంది. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా అదే ధోరణితో ఉన్నారు. ఎవరికి ఇస్తారో మరి. ఈసారి ప్రొటోకాల్‌ లేదు కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఛైర్మన్లు ఇలాంటి వారిని నెత్తిన పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ వారి కోసమే ఈ టికెట్లు పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. నిజంగా అధికారులకు చిత్తశుద్ధి ఉంటే... ఎవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో వివరాలు వెల్లడించాలని, వెబ్‌సైట్‌లో పేర్లు పెట్టాలని నగర ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు.

శాశ్వత దాతలకూ రిక్తహస్తాలు

దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం ఇస్తే చందనోత్సవం రోజున శీఘ్ర దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు. ఆ తరువాత అలా విరాళాలు ఇచ్చేవారికి పదేళ్లు మాత్రమే ఆ సౌకర్యం అని గడువు పెట్టారు. కరోనా సమయంలో రెండేళ్లు దర్శనాలు కల్పించలేదు. ఆ దాతలంతా తమకు ఆ రెండేళ్లు అదనంగా ఇవ్వాలని కోరుతున్నారు. అలా ఇవ్వలేకపోతే రూ.1,500 విలువైన టికెట్లు అయినా కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా లేఖలు సమర్పించిన వారికి దేవస్థానం నుంచి ఇప్పటివరకూ సమాధానం లేదు. తమకు నచ్చినవారికి మాత్రమే శీఘ్ర ధర్శనాలు చేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 08 , 2024 | 01:47 AM