పథకం ప్రకారమే గ్రీన్ బెల్ట్ కొట్టేశారు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:17 AM
కప్పరాడలో ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా కొట్టేయాలని మెగా షాపింగ్ మాల్ యజమానులు ముందుగానే ప్లాన్ వేసుకున్నారు.

రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి నాలుగేళ్ల క్రితమే ఏఎస్‌ఎన్
మెగా షాపింగ్ మాల్ యాజమాన్యం స్కెచ్
ఏపీఐఐసీకి సమర్పించిన ప్లాన్‌లోనే ప్రస్తావన
మూడు మార్గాలకు ఏర్పాట్లు
60 అడుగుల పొడవుతో రెండు డ్రైవ్ వేస్
నేషనల్ హైవే అథారిటీ ఎన్‌ఓసీ ఇవ్వక ముందే నిర్మాణానికి సిద్ధం
అనుమతులు లేకుండానే పనులు
ఉలుకూ పలుకూ లేని అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కప్పరాడలో ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా కొట్టేయాలని మెగా షాపింగ్ మాల్ యజమానులు ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. వారికి మూడు ఎకరాల స్థలం ఉన్నా అది సరిపోదని గ్రీన్ బెల్ట్‌ను కలిపేసుకున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా ఈ షాపింగ్‌మాల్ నిర్మాణంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వస్తున్నా...ఒక్క అధికారి గాని, ఒక్క ప్రజా ప్రతినిధి గానీ స్పందించకపోవడం గమనార్హం.
పాస్‌పోర్టు సేవా కేంద్రం ఎదురుగా మూడు ఎకరాల స్థలంలో అలక్రమ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ ‘ఏఎస్‌ఎన్ మెగా షాపింగ్ మాల్’ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భూ వినియోగ మార్పిడి (పరిశ్రమ నుంచి వాణిజ్యానికి) చేసుకున్నాకే మాల్ నిర్మాణం చేపట్టాలి. అందుకోసం ప్రభుత్వానికి భారీగా ఫీజు కట్టాలి. కానీ, అవేమీ లేకుండానే నిర్మాణం సగం పూర్తిచేసేశారు. కోట్ల రూపాయల ఆదాయం రావలసి ఉన్నా రెవెన్యూ అధికారులు ప్రశ్నించడం లేదు. ఇకపోతే ఈ భూమి ఏపీఐఐసీ లేఅవుట్‌లో ఉండడంతో మాల్ నిర్మాణానికి ఐలా కమిషనర్‌కు 2021లో దరఖాస్తు చేశారు. అప్పుడే వారి స్థలానికి ముందున్న గ్రీన్ బెల్ట్‌ను కలిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు సమర్పించిన ప్లాన్‌లోనే గ్రీన్ బెల్ట్‌ను ఏ విధంగా వాడుకుంటారనేది వివరించారు. 80 అడుగుల పొడవైన గ్రీన్ బెల్ట్‌లో 20 అడుగులు వాటర్ ఫౌంటెయిన్, 30 అడుగుల పొడవుతో ఒక డ్రైవ్ వే, ఇంకో 30 అడుగుల పొడవుతో మరో డ్రైవ్ వే ఏర్పాటుచేయనున్నట్టు ప్లాన్‌లో చూపించారు. జాతీయ రహదారి నుంచి షాపింగ్ మాల్‌కు మూడు మార్గాలు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే వారి భూమికి ముందు ఎంత వెడల్పున గ్రీన్ బెల్ట్ ఉందో అంతా ఉపయోగించుకుంటామని ప్లాన్‌లో వివరించారు. ఆ గ్రీన్ బెల్ట్ భూమి జీవీఎంసీకి సంబంధించినది. వారి అనుమతి లేకుండానే, వారితో ఎటువంటి ఒప్పందం లేకుండానే దానిని ఉపయోగించుకుంటామని ప్లాన్ పెట్టారు. అలాగే గ్రీన్‌బెల్ట్ నుంచి దారి కోసం భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు దరఖాస్తు చేశారు. ప్లాన్‌లో మార్గాలు చూపించి, ఎన్‌హెచ్‌ఏఐకు నాలుగు మార్గాలు కావాలని కోరారు. దానికి వారు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) మాత్రమే ఇచ్చారు. మాల్‌కు మార్గం ఏర్పాటు చేసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, కాకపోతే ఆ భూమి ఎవరిదో వారి నుంచి అనుమతి తీసుకోవాలని, ఆ గ్రీన్ బెల్ట్ తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ఈ నెల 23న విశాఖ ఎంపీ శ్రీభరత్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించినప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్పష్టంచేశారు. తాము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, కేవలం ఎన్‌ఓసీ ఇచ్చామని పేర్కొన్నారు. అంటే ఆ భూమి యజమాని అయిన జీవీఎంసీయే దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కూడా ఉన్నారు. కలెక్టర్ స్పందించి ఎంక్వయిరీ వేయాలని విష్ణుకుమార్‌రాజు కోరారు. దానికి ఆయన అంగీకరించారు.
ఆ భూమి విలువ రూ.60 కోట్లు
పి.విష్ణుకుమార్‌రాజు,
ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే
మెగా షాపింగ్‌మాల్ యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన రూ.60 కోట్ల విలువైన భూమి (గ్రీన్ బెల్ట్)ని కలిపేసుకుంది. గ్రీన్ బెల్ట్ నుంచి నాలుగు దారులు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి 3,964 చ.అడుగుల భూమిని సిమెంట్ కాంక్రీట్‌గా మార్చి డ్రైవ్ వేలు నిర్మించుకుంది. ఆ భూమి జీవీఎంసీకి చెందినది. వారు స్పందించడం లేదు. కూటమి నాయకుల ఫ్లెక్సీలు నిర్మాణం ముందు పెట్టారని తెలిసి వెళ్లి చూశాను. నా ఫొటో కూడా ఉంది. మొత్తం అందరివీ తీసేయాలని చెప్పి తొలగింపజేశాను. అయితే వారు మళ్లీ నా ఒక్క ఫొటో తప్ప ఇతర నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. వాటితో అధికారులను బెదిరిస్తున్నారు. 1,500 మందికి ఉపాధి కల్పిస్తే ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటారా? దానిని అధికారులు ఆమోదిస్తారా?, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.