పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:13 AM
పేదలందరికీ 2029 నాటికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు తెలిపారు.
అనకాపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ 2029 నాటికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు తెలిపారు. మంగళవారం అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహనిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల సహకారంతో మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పీఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు.