Share News

సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:40 AM

సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత గిరిజన సమాజమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు. ఏజెన్సీలో గిరిజనులను దీనిపై చైతన్య పరచాలన్నారు.

సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం
జెండా ఊపి సికిల్‌సెల్‌ ఎనీమియా ప్రచార రథం ప్రారంభిస్తున్న పీవో అభిషేక్‌

- ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌

పాడేరు ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత గిరిజన సమాజమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు. ఏజెన్సీలో గిరిజనులను దీనిపై చైతన్య పరచాలన్నారు. ప్రధాన మంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌(జన్‌మన్‌)లో భాగంగా ఏర్పాటు చేసిన సికిల్‌సెల్‌ ఎనీమియా ప్రచార రఽథాలను ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించాయన్నారు. తొలి విడతగా స్థానిక ఐటీడీఏకు రెండు ప్రచార వాహనాలు పాడేరు చేరుకున్నాయని, మరో నాలుగు వాహనాలు త్వరలో వస్తాయన్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 35 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియాపై ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. డివిజన్‌ పరిధిలో 1,550 గ్రామాల్లో ప్రచారం చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించామని, ప్రతి రోజు మూడు నుంచి ఐదు గ్రామాల్లో ప్రచార రథం పర్యటించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాలకు ప్రచార రథం వచ్చిన సమయంలో సంబంధిత వైద్యాధికారి, వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచులు విధిగా భాగస్వామ్యం కావాలన్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమియా లక్షణాలను, నివారణ చర్యలను ప్రజలకు వివరించాలని ఐటీడీఏ పీవో సూచించారు. ఐటీడీఏ పరిధిలో లక్షా పది వేల మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,050 మందికి సికిల్‌సెల్‌ ఎనీమియా పాజిటివ్‌ వచ్చిందని, వారికి మరో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 650 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా ఉందని తేలిందన్నారు. దీంతో వారికి అవసరమైన మందులు, సికిల్‌ సెల్‌ ఎనీమియా పింఛన్‌ మంజూరుకు సిఫారసు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:40 AM