Share News

తీరాన్ని కమ్మేసిన పొగమంచు

ABN , Publish Date - May 27 , 2024 | 12:22 AM

ఆర్కే బీచ్‌ పరిసర ప్రాంతాలను ఆదివారం పొగ మంచు కమ్మేసింది.

తీరాన్ని కమ్మేసిన పొగమంచు

తేమ, పొడి గాలుల కలయికే కారణం

అడ్వెంక్షన్‌ పొగ (అభివాహక పొగ మంచు)గా పేర్కొన్న నిపుణులు

ఆర్‌కే బీచ్‌కు భారీగా తరలివచ్చిన సందర్శకులు

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి) :

ఆర్కే బీచ్‌ పరిసర ప్రాంతాలను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం నుంచే తీవ్రమైన గాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. దీనికి తోడు పొడి గాలులు భూ ఉపరితలం నుంచి తుఫాన్‌ దిశగా సముద్రం వైపు వీచాయి. వీటికి సముద్రంలోని తేమ గాలులు కలవడంతో పెద్ద ఎత్తున పొగ మంచు ఏర్పడింది. ఈ మంచు తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతాలను కమ్మేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున ఏర్పడిన పొగ మంచుతో భిన్నమైన వాతావరణం కనిపించింది. శీతాకాలంలో ఉదయాన్నే గోచరించే వాతావరణం ఆదివారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కనిపించింది. దీంతో ఫొటోలు తీసేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. ఈ పొగ మంచును అడ్వెంక్షన్‌ పొగ (అభివాహక పొగ మంచుగా) పిలుస్తారని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

పోటెత్తిన సందర్శకులు

భానుడి తాపంతో విలవిల్లాడుతున్న నగర వాసులు సేద తీరేందుకు ఆదివారం సాయంత్రం భారీగా ఆర్కే బీచ్‌కు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వందలాదిగా వచ్చిన సందర్శకులతో సాగరతీరం కిక్కిరిసిపోయింది. ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు సముద్ర స్నానాలు చేశారు. అలల తాకిడితో సిబ్బంది సందర్శకులను సముద్ర స్నానాలకు అనుమతించలేదు. సాయంత్రం అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు కెరటాలలో సందడి చేశారు.

Updated Date - May 27 , 2024 | 12:22 AM