Share News

తొలిగా మాడుగుల ఫలితం

ABN , Publish Date - May 26 , 2024 | 12:48 AM

జిల్లాలో జూన్‌ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం భారీగా కసరత్తు చేస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగించేందుకు వీలుగా ఇప్పటికే ఉద్యోగులను నియమించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి నేతృత్వంలో వారికి ఓట్ల లెక్కింపుపై మాక్‌ డ్రిల్‌, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తొలిగా మాడుగుల ఫలితం
కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌లో శనివారం అందిన పోస్టల్‌ బ్యాలెట్‌లను భద్రపరిచి సీలు వేయిస్తున్న డీఆర్‌వో దయానిధి, ఇతర ఎన్నికల అధికారులు

చివరిగా ‘పాయకరావుపేట’...

- వచ్చే నెల 4న మధ్యాహ్నం 2.30 గంటలకే మాడుగుల రిజల్ట్‌

- సాయంత్రం 6 గంటల తరువాత పాయకరావుపేట ఫలితం

- ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం

- లెక్కింపు ప్రక్రియపై మాక్‌ డ్రిల్‌ శిక్షణ

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జూన్‌ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం భారీగా కసరత్తు చేస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగించేందుకు వీలుగా ఇప్పటికే ఉద్యోగులను నియమించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి నేతృత్వంలో వారికి ఓట్ల లెక్కింపుపై మాక్‌ డ్రిల్‌, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో ఓట్ల నమోదు శాతం, 14 టేబుళ్లపై కౌంటింగ్‌ రౌండ్లను బట్టి మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తొలుత వెల్లడి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో 1,88,989 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,62,580 మంది ఈ నెల 13న నియోజకవర్గ పరిధిలోని 235 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాడుగుల అసెంబ్లీ ఫలితం జూన్‌ 4వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు రానున్నదని, జిల్లాలో ఇదే తొలి ఫలితం కానున్నదని అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో చివరిగా పాయకరావుపేట అసెంబ్లీ ఫలితం రానుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 292 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను 20 పూర్తిస్థాయి రౌండ్లలో లెక్కించాల్సి ఉంటుంది. 21వ రౌండ్‌లో 12 బూత్‌ల ఓట్లు లెక్కించనున్నారు. పాయకరావుపేట అసెంబ్లీ ఫలితం సాయంత్రం 6 గంటలు దాటిన తరువాతే వస్తుందని అంచనా వేస్తున్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లో పోస్టల్‌ బ్యాలెట్లు భద్రం

జిల్లాలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల పరిధిలోని పోస్టల్‌ బ్యాలెట్లు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుతున్నాయి. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అందిన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లను కలెక్టరేట్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన అధికారులు పోస్టు ద్వారా అందుతున్న సర్వీసు ఓట్లను ప్రతి రోజు స్వీకరించి వాటిని ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తున్నారు. పోలీసుల సమక్షంలో గదికి సీలు వేస్తున్నారు.

జిల్లాలో అధికారుల గణాంకాల ప్రకారం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హోం ఓటర్లు 1,082 మంది ఇళ్ల వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 12,864 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 1,468 మంది, త్రివిధ దళాలకు చెందిన సర్వీసు ఓటర్లు 1,051 మంది, ఇతర జిల్ల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 2,909 మందితో కలిపి మొత్తం 19,374 పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

వచ్చే నెల 3వ తేదీ వరకు స్వీకరణ

ఉద్యోగులు, పొరుగు జిల్లాల నుంచి అందుతున్న ఓట్లను ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో జిల్లా ఎన్నికల అధికారులు భద్రపరుస్తున్నారు. జూన్‌ 3వ తేదీ సాయంత్రం వరకు సరిహద్దుల్లో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సర్వీసు ఉద్యోగులు, పోలీసు శాఖ ఉద్యోగుల నుంచి అందిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను స్వీకరించనున్నారు. జిల్లాకు చెందిన త్రివిధ దళాలకు చెందిన సర్వీసు ఓటర్లు 2,519 మంది పోస్టల్‌ బ్యాలెట్‌లు పొందగా, వాటిలో శనివారం నాటికి జిల్లా ఎన్నికల అధికారులకు 1,262 పోస్టల్‌ బ్యాలెట్లు అందాయి. జిల్లాకు చెందిన ఇంకా 1,257 బ్యాలెట్‌లు అధికారులకు పోస్టల్‌ శాఖ ద్వారా చేరాల్సి ఉంది.

పోస్టల్‌ బ్యాలెట్‌లే ముందుగా లెక్కింపు

జూన్‌ 4న ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించాల్సి ఉంటే, ముందుగా పోస్టల్‌, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. జిల్లాకు చేరిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి టేబుల్‌ వద్ద ఒక ఆర్‌వో, ఏఆర్‌వో పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఆయా అధికారులను ఇప్పటికే నియమించి పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇస్తున్నారు. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ముందుగా జిల్లాకు చెందిన 19,374 పోస్టల్‌ బ్యాలెట్‌లను 14 టేబుళ్లపై లెక్కించనున్నారు. దీనికి సుమారు అర్ధగంట సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని అధికారులు పేర్కొన్నారు.

స్వల్పంగా పెరిగిన అనకాపల్లి పార్లమెంట్‌ పోలింగ్‌ శాతం

అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 82.03 శాతం ఓట్లు పోలయ్యాయని తాజాగా ఎన్నికల కమిషన్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. గతంలో పార్లమెంట్‌ పరిధిలో 79.77 శాతం పోలింగ్‌ జరిగినట్టు జిల్లా అధికారులు ప్రకటించినా తరువాత పోస్టల్‌ ఓటర్లు, ఇతరత్రా ఓటర్లతో కలిపి పార్లమెంట్‌ స్థానం పరిధిలో 82.03 శాతం పోలింగ్‌ జరిగినట్లు తేల్చింది. అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట, పెందుర్తితో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 15,96,916 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13,09,977 (82.03 శాతం) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలో 12,89,371 మంది ఓటర్లు, 28 మంది ఇతర ఓటర్లు ఉండగా ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో 10,81,042 (83.84 శాతం) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 5,26,106 మంది, మహిళలు 5,54,924 మంది, ఇతరులు 12 మంది ఉన్నారని ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.

Updated Date - May 26 , 2024 | 12:48 AM