పేదల భూములపై పెద్దల కన్ను
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:28 AM
ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక ఉన్నతాధికారితో పాటు మరికొందరు కలిసి నగర శివారునున్న ఆనందపురం మండలం గండిగుండం, వేములవలస ప్రాంతాల్లో బినామీల పేరుతో డీపట్టా భూములు కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది.
ఆనందపురం మండలంలో డి.పట్టా భూములు కొనుగోలు
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా 500 ఎకరాలు టార్గెట్
200 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధమైన సీనియర్ ఐఏఎస్ అధికారి
మిగిలిన 300 ఎకరాలు వైసీపీ నేతలకు...
22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్న అధికారులు
బినామీ పేర్లతో రిజిస్ర్టేషన్లు
జరుగుతున్నాయంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక ఉన్నతాధికారితో పాటు మరికొందరు కలిసి నగర శివారునున్న ఆనందపురం మండలం గండిగుండం, వేములవలస ప్రాంతాల్లో బినామీల పేరుతో డీపట్టా భూములు కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం 500 ఎకరాల వరకూ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇప్పటికే 150 ఎకరాల మేర లావాదేవీలు పూర్తయ్యాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా ఈ భూముల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతుంది.
రాష్ట్రంలో దళిత, వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం 1970 తరువాత ప్రభుత్వం ఎకరా నుంచి ఐదెకరాల వరకూ పంపిణీ చేసింది. ఈ విధంగా విశాఖ నగర శివారు ప్రాంతాలైన ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం, సబ్బవరం మండలాల్లో వేలాది మందికి అప్పట్లో పట్టాలు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసుకోవడం ద్వారా రైతులు తమ కుటుంబాలను షోషించుకోవాలి. ఎవరికీ విక్రయించకూడదు. అయితే చాలామంది కుటుంబ అవసరాల కోసం అమ్మేసుకున్నారు. పేదల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కారుచౌకగా డీపట్టా భూములను దక్కించుకున్న కొనుగోలుదారులు తమ పలుకుబడి ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకుని, పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. ఇలా నగరం, చుట్టుపక్కల ప్రధాన రహదారులకు ఆనుకుని కొన్ని డీపట్టా భూములు చేతులు మారిపోయాయని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు.
ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ పెద్దలు, కొంతమంది ఉన్నతాధికారులు...డీపట్టా భూములపై కన్నేశారు. ఈ క్రమంలోనే క్రయవిక్రయాలకు అనుమతిస్తూ జీవో విడుదల చేశారు. దీని ప్రకారం ఇప్పటివరకూ (20 ఏళ్లు దాటినవి) చేతులుమారని డీపట్టా భూములు సదరు పట్టాదారుడికి దఖలు పడేలా కన్వేయన్స్ డీడ్ జారీచేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆ భూములను అధికారికంగా విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. ఆ జీవో విడుదలకు ముందే (ఏడాది కిందట నుంచి) వైసీపీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు విశాఖ పరిసరాల్లో డీపట్టా భూములు కొనుగోలుకు బేరసారాలు సాగిస్తున్నారు. పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో డీపట్టా భూముల కొనుగోలుకు కొందరు బినామీలను రంగంలోకి దించారు. ఇప్పటికీ చేతులు మారని పట్టా భూముల రైతులతో సంప్రతింపులు జరిపారు. ఈ విధంగా ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో ఉన్న సీనియర్ ఐఏఎస్‌తో పాటు మధ్య కోస్తాకు చెందిన మంత్రి ఒకరు, మరికొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు డీపట్టా భూములు భారీగా కొనుగోలు చేశారు. ఆనందపురం మండలం గండిగుండం గ్రామంలో సుమారు 50 ఎకరాలను వైసీపీకి చెందిన నేత ఒకరు ఇటీవల కొనుగోలు చేశారు. ఆ భూముల్లో కొబ్బరిమొక్కలు నాటారు. రాష్ట్రంలో ప్రముఖుని కోసం ఈ భూములు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇంకా పొరుగు జిల్లాలో చక్రం తిప్పుతున్న మరో కీలక నేత కూడా గండిగుండంలో డీపట్టా భూములు కొనుగోలు చేశారు. పొరుగు జిల్లా నేతకు ఈ ప్రాంతంలో వైసీపీ నేతలు కొందరు సాయపడ్డారు. గండిగుండంలో సర్వేనంబరు 272 నుంచి 275 వరకూ సుమారు 20 ఎకరాల మేర డీపట్టా భూములు విక్రయాలు జరిగాయి. దీనికి సంబంధించి ఆనందపురంలో రిజస్ట్రేషన్లు జరిగాయి. పాలవలసలో డీపట్టా భూములను నగరానికి చెందిన వైసీపీ ఇన్‌చార్జి ఒకరు కొనుగోలు చేశారు.
చేతులు మారని డీపట్టా భూముల సర్వే నంబర్లను 22 ‘ఏ’ జాబితా నుంచి జిల్లా అధికారులు తొలగించడంతో రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతలు, కీలక అఽధికారులు కొనుగోలు చేసిన భూములను మాత్రమే 22 (ఎ) జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పద్మనాభం మండలాల్లో సుమారు మూడు వేల ఎకరాల డీపట్టా భూములు చేతులు మారుతున్నాయి. ఇందులో 100 నుంచి 200 ఎకరాలు ఒక కీలక అధికారి తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయనకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా జిల్లా అధికారులు సహకరిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.