పేదింటి కల నెరవేర్చలేక పాయె!
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:56 AM
జగనన్న కాలనీల ఏర్పాటుతో పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామన్న గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. నవరత్నాలు, పేదలందరికీ సొంతిల్లు కల నేర్చడంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ పడకేశాయి.

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగని పనులు
జగనన్న కాలనీల్లో సగం కూడా పూర్తి కాని ఇళ్ల నిర్మాణాలు
లబ్ధిదారులు అప్పులు చేసి పనులు చేపట్టినా బిల్లులు మంజూరు చేయని వైనం
ఐదేళ్ల పాటు ప్రచార ఆర్భాటానికే పరిమితం
కూటమి ప్రభుత్వంపైనే జనం ఆశలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జగనన్న కాలనీల ఏర్పాటుతో పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామన్న గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. నవరత్నాలు, పేదలందరికీ సొంతిల్లు కల నేర్చడంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ పడకేశాయి. లబ్ధిదారులు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టానా చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, నిర్మాణ సామగ్రి అందకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. చాలాచోట్ల అసలు పునాదులే పడకపోగా, కొన్నిచోట్ల మొండిగోడలు, అరకొర నిర్మాణాలతో జగనన్న కాలనీలు దర్శనమిస్తున్నాయి.
పేదల ఇళ్ల నిర్మాణాల విషయంలో ఐదేళ్లుగా ప్రచార ఆర్భాటం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వరకు జిల్లాలో కనీసం సగం లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఇంతలో ఎన్నికలు రావడంతో గత ఏప్రిల్ నెల నుంచి పేదల ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం రావడంతో తమ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని లబ్ధిదారులు ఆశతో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ అందించాల్సిన సిమెంట్, ఇసుక, ఇనుము సకాలంలో పంపిణీ చేయకపోవడం, చేసిన పనికి బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయామని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రూ.1.8 లక్షలు ఇంటి నిర్మాణానికి ఏమూలకు చాలకపోయినా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే తాపత్రయంతో అనేకమంది పేదలు అవస్థలు పడి మరీ నిర్మాణ పనులకు సిద్ధమయ్యారు. లబ్ధిదారుడు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం ఇసుక, సిమెంట్, , ఇనుము ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం వీటిని అరకొరగా అందించడంతో అవి సరిపోక పలుచోట్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. కొందరు లబ్ధిదారులు అప్పులు చేసి ఇంటి పనులు చేపట్టినా బిల్లులు మాత్రం అందలేదు.
సగం ఇళ్లు కూడా పూర్తి కాని వైనం
జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం పేదలకు గత నాలుగేళ్లలో 56,580 గృహాలు మంజూరు చేసింది. వీటిలో సగం ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తికాలేదు. ఇళ్ల నిర్మాణ పనుల కోసం రూ.1,018 కోట్లు మంజూరు చేసినా కేవలం రూ.537 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో జిల్లాలో జగనన్న కాలనీల్లో కేవలం 22 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాల్లో బేస్‌మెంట్ లెవిల్ లోపు 14,730, బేస్‌మెంట్ లెవిల్‌లో 11,039, రూఫ్ లెవిల్‌లో 2,823, రూఫ్ కాస్ట్ దశలో 3,452 నిర్మాణాలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు గత ఏప్రిల్ నెల వరకు అక్కడక్కడా ఇళ్ల నిర్మాణ పనులు జరిగినా తరువాత ఎన్నికలు జరగడంతో గత మూడు నెలలుగా పేదల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో ఆగిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారుల ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తాము ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేకపోయామని, కొత్త ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.