ఆలయ మాన్యం కైంకర్యం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:48 AM
మండలంలోని గొర్లె ధర్మవరం పంచాయతీ లంక ధర్మవరంలోని రామాలయం ఆస్తులకు ధర్మకర్తల్లోని ఓ వర్గం ఎసరు పెట్టింది. 7.81 ఎకరాల ఆలయ భూముల రికార్డులను వైసీపీ నేత అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో మార్చేసింది. ఇటీవల ఎన్నికల ముందు ఆ భూములను ఓ రియల్టర్‌కు కారుచౌకగా అమ్మేసింది. దీంతో శిథిలావస్థకు చేరిన ఆలయానికి మరమ్మతులు చేయడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొంది. దీనిపై విచారణ జరపాలని లంక ధర్మవరం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

- ఎన్నికల ముందు ఆలయ భూముల రికార్డులను మార్చేసిన ధర్మకర్తల్లోని ఓ వర్గం
- వైసీపీ నేత అండదండలతో బరితెగింపు
- సహకరించిన రెవెన్యూ అధికారులు
- కారుచౌకగా ఓ రియల్టర్‌కు విక్రయించేసిన వైనం
- శిథిలావస్థకు చేరిన రామాలయ మరమ్మతులకు నిధులు లేని దుస్థితి
- విచారణ జరపాలని లంక ధర్మవరం గ్రామస్థుల డిమాండ్
అచ్యుతాపురం, జూన్ 26: మండలంలోని గొర్లె ధర్మవరం పంచాయతీ లంక ధర్మవరంలోని రామాలయం ఆస్తులకు ధర్మకర్తల్లోని ఓ వర్గం ఎసరు పెట్టింది. 7.81 ఎకరాల ఆలయ భూముల రికార్డులను వైసీపీ నేత అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో మార్చేసింది. ఇటీవల ఎన్నికల ముందు ఆ భూములను ఓ రియల్టర్‌కు కారుచౌకగా అమ్మేసింది. దీంతో శిథిలావస్థకు చేరిన ఆలయానికి మరమ్మతులు చేయడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొంది. దీనిపై విచారణ జరపాలని లంక ధర్మవరం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
లంక ధర్మవరం గ్రామంలో రామాలయం, పైడితల్లమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల పూజాది కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాల కోసం లంక ధర్మవరం, గొర్లె ధర్మవరానికి చెందిన పెద్దలు గతంలో 11.81 ఎకరాల భూమిని కేటాయించారు. దీనిని పైడితల్లమ్మవారి మాన్యంగా రికార్డుల్లోకెక్కించారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో మూడు దేవాలయాల్లో నిత్య ఆరాధన జరిపేవారు. అయితే దేవుళ్ల పండగలకు ఊరేగింపులు, చాటింపులకని 3.55 ఎకరాలు బారిక మాన్యం కింద కేటాయించారు. మిగిలిన భూమిలో గొర్లె ధర్మవరం గ్రామస్థులకు నాలుగెకరాలు, లంక ధర్మవరం గ్రామస్థులకు 4.20 ఎకరాలు అప్పట్లో పెద్దలు కేటాయించారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో మూడు ఆలయాల నిర్వహణతో పాటు పైడితల్లమ్మవారి జాతరను ప్రతి సంవత్సరం ఘనంగా జరపాలని నిర్ణయించారు. పైడితల్లమ్మవారికి లంక ధర్మవరం పుట్టిల్లు గాను, గొర్లె ధర్మవరం అత్తవారిల్లుగా అప్పటి పెద్దలు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం ముందుగా లంక ధర్మవరం గ్రామస్థులు (పుట్టింటి వాళ్లు) పండగ చేస్తారు. రెండు నెలల తరువాత గొర్లె ధర్మవరం గ్రామస్థులు (అత్తింటి వాళ్లు) పండగ చేస్తారు. అంతేకాక ఈ భూమిపై వచే ్చ ఆదాయంలో రామాలయం, దుర్గాలయాలు కూడా అభివృద్ధి చేసేవారు. అయితే ఇటీవల ఎన్నికల ముందు లంక ధర్మవరం గ్రామానికి చెందిన ధర్మకర్తల్లో ఓ వర్గం.. వైసీపీ నాయకుల అండదండలతో పైడితల్లమ్మవారి మాన్యంగా రికార్డుల్లో ఉన్న ఈ భూమిలో బారిక మాన్యం 3.55 ఎకరాలతో పాటు లంకధర్మవరం ధర్మకర్తలకు చెందిన 4.20 ఎకరాలు వెరసి 7.81 ఎకరాలను ఓ రియల్టర్‌కి విక్రయించేశారు. ఇక్కడ సెంటు రెండు లక్షల రూపాయలు ఉండగా, ఎకరా రూ.12 లక్షలకు కారుచౌకగా విక్రయించేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రధాన నాయకుడితో పాటు రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్టు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కాగా లంక ధర్మవరంలో రామాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ మండపం కూలిపోతోంది. దీనిని బాగు చేయించాలని గ్రామస్థులు కోరడంతో ఆలయ భూములు విక్రయించిన విషయం బయటకు వచ్చింది. గొర్లె ధర్మవరం గ్రామస్థులు మాత్రం తమకు కేటాయించిన నాలుగెకరాల్లో జీడితోటలు పెంచి కౌలుకిచ్చి దానిపై వచ్చిన ఆదాయంలో పైడితల్లి అమ్మవారి పండగలు చేస్తున్నారు. ఈ నెల 25న పైడితల్లి అమ్మవారి పండగ గొర్లెధర్మవరం వాసులు ఘనంగా జరిపారు. కాగా దేవుడి మాన్యం విక్రయంపై విచారణ జరపాలని లంక ధర్మవరం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.