Share News

వాడీవేడిగా కౌన్సిల్‌ సమావేశం

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:41 AM

అభివృద్ధి పనులు, నిధుల వ్యయంపై మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీ, తెలుగుదేం పార్టీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చైర్‌పర్సన్‌ పోడియం ఎదుట బాహాబాహీకి దిగారు. మూడో వార్డు కౌన్సిలర్‌ చెక్క బాలమ్మ, కోఆప్షన్‌ సభ్యురాలు రోజా వచ్చి ఇరుపార్టీల సభ్యులను శాంతింపజేశారు.

వాడీవేడిగా కౌన్సిల్‌ సమావేశం
కౌన్సిల్‌ సమావేశంలో గొడవపడుతున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

అభివృద్ధి పనులపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం

పరస్పరం తోపులాట, బిగ్గరగా కేకలు

మహిళా సభ్యుల జోక్యంతో శాంతించిన ఇరువర్గాలు

నర్సీపట్నం, మార్చి 5: అభివృద్ధి పనులు, నిధుల వ్యయంపై మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీ, తెలుగుదేం పార్టీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చైర్‌పర్సన్‌ పోడియం ఎదుట బాహాబాహీకి దిగారు. మూడో వార్డు కౌన్సిలర్‌ చెక్క బాలమ్మ, కోఆప్షన్‌ సభ్యురాలు రోజా వచ్చి ఇరుపార్టీల సభ్యులను శాంతింపజేశారు.

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. మునిసిపల్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటలక్ష్మి 14 అంశాలతో ప్రధాన అజెండాతోపాటు ఏడు అంశాల టేబుల్‌ అజెండాను సమర్పించారు. అనంతరం 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ, కొత్తవీధి బైపాస్‌ రోడ్డు సైడ్‌ వాల్‌ నిర్మించకుండా బీటీ రోడ్డు ఎందుకు వేశారని ప్రశ్నించారు. సైడ్‌ వాల్‌ లేకపోతే రోడ్డు కుంగి పోదా అని డీఈ నారాయణను నిలదీశారు. విగ్రహాలు పెట్టిన ప్రాంతంలో కూడా కాంక్రీట్‌ వేయలేదని, చెరువు మట్టి వేసి విగ్రహాలు పెట్టారని అన్నారు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యిందని ప్రశ్నించారు. డీఈఈ సమాధానం చెబుతూ.. సైడ్‌వాల్‌ నిర్మిస్తున్నామని, మొత్తం పని విలుక రూ.6 కోట్లుకాగా ఇంతవరకు రూ.3 కోట్లు ఖర్చు అయ్యిందని వివరించారు. కౌన్సిలర్‌ మధు మాట్లాడుతూ, మెయిన్‌ రోడ్డు విస్తరణ పనుల్లో కాంక్రీట్‌ తడపడానికి శుద్ధి చేసిన తాగునీటిని వాడుతున్నారని, ఇందుకోసం కాంట్రాక్టర్‌ ఏమైనా డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే రోడ్డు తడపడానికి క్లోరినేషన్‌ చేసిన నీటిని వినియోగిస్తారా అనినిలదీశారు. మునిసిపల్‌ ఏఈ రవి సమాధానం ఇస్తూ.. కాంట్రాక్టర్‌ చేస్తున్న పనికి ఎంబుక్‌ రాస్తున్నామని, ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ అజెండాలోని 11, 12 అంశాలలో పేర్కొన్న ఎంపీ నిధులతో చేపడుతున్న రోడ్డు పనులు నామినేషన్‌ విధానంలో ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ నిధులు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని అన్నారు. నాణ్యత లేని రోడ్లు వేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ, నర్సీపట్నంలో 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధినిఇ ప్రస్తుత ఎమ్మెల్యే నాలుగేళ్లలో చేసి చూపించారని అన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ మధు స్పందిస్తూ.. టిడ్కో గృహాల బ్యాంకు రుణాలను మాఫీ చేసి లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తామన్న హామీని అమలు చేశారా? అని ప్రశ్నించారు. దీంతో వైస్‌చైర్మన్‌ రామకృష్ణ, టీడీపీ కౌన్సిలర్‌ మధుల మధ్య వాగ్వాదం జరిగింది. వీరికి మద్దతుగా ఆయా పార్టీల కౌన్సిలర్లు చింతకాయల రాజేశ్‌, రాజునాయుడు బయపురెడ్డి చిన్నబాబు, మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని నిలిచి, చైర్‌పర్సన్‌ పోడియం ముందు వాగ్వాదానికి దిగారు. పరస్పరం తోసుకున్నారు. ఈ సమయంలో 27వవార్డు టీడీపీ కౌన్సిలర్‌ పైల కాశీరత్నం భర్త గోవింద్‌ సమావేశ మందిరంలోకి రావడంతో వైసీపీ కౌన్సిలర్‌ సిరసపల్లి నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యుడు కాని వ్యక్తి కౌన్సిల్‌ సమావేశంలోకి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట మరింత పెరగడంతో మూడో వార్డు కౌన్సిలర్‌ చెక్క బాలమ్మ, కోఆప్షన్‌ సభ్యురాలు రోజా వచ్చి ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం 9వవార్డు కౌన్సిలర్‌ (జనసేన) అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌ను ధ్వంసం చేయడంతో వాకింగ్‌కు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. ప్రైవేటు కార్యక్రమాలకుఅద్దెకు ఇవ్వడం వల్ల స్టేడియంను పాడవుతున్నదని అన్నారు. టిడ్కో లబ్ధిదారులు చెల్లించిన డిపాజిట్లను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ వారికి డబ్బులు తిరిగి చెల్లించలేదని, వెంటనే ఇప్పించాలని కోరుతూ చింతకాయల పద్మావతి, రాజేశ్‌లు చైర్‌పర్సన్‌ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Mar 06 , 2024 | 12:41 AM