Share News

అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం చేసిన సీఎం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:42 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని 20 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను నమ్మించి తీరని అన్యాయం చేశారని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం చేసిన సీఎం
విలేకరులతో మాట్లాడుతున్న బాబ్జీ

లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 17 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని 20 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను నమ్మించి తీరని అన్యాయం చేశారని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. బుధవారం జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. 2017 మార్చి 23న విజయవాడలో బాధితులు దీక్ష చేపట్టగా శిబిరాన్ని సందర్శించిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో బాధితులకు ప్రతి పైసా చెల్లిస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఉత్తరాంధ్రలో ఆరు లక్షల మంది ఉన్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు చనిపోయారని, వారికి రూ.మూడు లక్షలు అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటిస్తే జగన్‌ రూ.పది లక్షలు ప్రకటించి విడుదల చేయలేదన్నారు. అగ్రిగోల్డ్‌ కంపెనీకి రూ.20వేల కోట్ల ఆస్తులున్నాయని ప్రభుత్వం ప్రకటించి కూడా బాధితులకు న్యాయం చేయకపోవడాన్ని బాబ్జీ తప్పుపట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రకటన చేయాలని భీశెట్టి డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కె.రమణ, కేఎం నాయుడు, కె. నరసింగరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:42 PM