శ్వాస అందక చిన్నారి మృతి
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:59 PM
మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్వాస అందక మూడు నెలల శిశువు మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన వంజరి ఈశ్వరి, గణపతి దంపతుల మూడు నెలల పాపకి గతంలో రెండు సార్లు వ్యాక్సిన్ వేశారు.
చింతపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్వాస అందక మూడు నెలల శిశువు మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన వంజరి ఈశ్వరి, గణపతి దంపతుల మూడు నెలల పాపకి గతంలో రెండు సార్లు వ్యాక్సిన్ వేశారు. బుధవారం స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో మరో వ్యాక్సిన్ వేశారు. మధ్యాహ్నం ఆ చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో పాప తండ్రి వెంటనే ఏఎన్‌ఎంకి ఫోన్ చేసి సమస్యను వివరించారు. వ్యాక్సిన్ వేసిన తరువాత జ్వరం సహజంగా వస్తుందని ఆమె చెప్పింది. సాయంత్రం శిశువు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో తల్లిదండ్రులు గాలి పట్టిందని దిష్టి తీసి సంప్రదాయ వైద్యం చేశారు. శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాత్రి ఎనిమిది గంటలకు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చిన్నారి శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతూ ఆయాస పడుతోంది. స్థానిక వైద్యులు వెంటనే పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కేజీహెచ్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.