Share News

సీఎం రమేశ్‌పై దాడి దారుణం

ABN , Publish Date - May 06 , 2024 | 01:10 AM

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో శనివారం బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని కూటమి శ్రేణులు ఖండించాయి. ఆదివారం పలు చోట్ల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

సీఎం రమేశ్‌పై దాడి దారుణం
సీఎం రమేశ్‌పై బూడి ముత్యాలనాయుడు దాడికి నిరసనగా మాకవరపాలెంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

- ఖండించిన కూటమి శ్రేణులు

- పలు చోట్ల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకుల నిరసనలు

మాకవరపాలెం/పాయకరావుపేట/గొలుగొండ/కృష్ణాదేవిపేట, మే 5: డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో శనివారం బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని కూటమి శ్రేణులు ఖండించాయి. ఆదివారం పలు చోట్ల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాకవరపాలెంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఆర్‌వై పాత్రుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిరసన చేపట్టారు. పాయకరావుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా స్థానిక పాత పంచాయతీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గొలుగొండ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణాదేవిపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చేశారు.

దేవరాపల్లి సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయాలి

నర్సీపట్నం: సీఎం రమేశ్‌పై జరిగిన దాడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవరాపల్లి సీఐ, ఎస్‌ఐలను జిల్లా ఎస్పీ వెంటనే సస్పెండ్‌ చేయాలని, లేని పక్షంలో సోమవారం అనకాపల్లి వస్తున్న ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ధర్నా చేస్తామని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. ఆదివారం స్థానిక విలేకరులకు వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంలోనే బూడి ముత్యాలనాయుడు దాడులు చేయించారని ఆరోపించారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పై దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులు, కార్యర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 06 , 2024 | 01:10 AM